తుక్కుగూడలో నర్స్ శిరీష హత్యపై మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి

నిందితుడిని కఠినంగా శిక్షించాలి.. డీజీపీకి ఫోన్

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి సీత‌క్క‌

హైదరాబాద్, వెలుతురు, ఆగస్టు 31:

రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నర్స్ శిరీష దారుణ హత్యకు గురైన ఘటనపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విధులు నిర్వహిస్తున్న శిరీష ప్రాణాలను దారుణంగా బలిగొన్న ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసు అధికారులు, పహాడీషరీఫ్ ఇన్‌స్పెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి హత్యకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు.

అనంతరం డీజీపీ సీవీ ఆనంద్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీతక్క ఘటనపై సమగ్రంగా, ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని కోరారు. విచారణను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేసి, బాధిత కుటుంబానికి త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

తన కుటుంబానికి అండగా నిలవాల్సిన వయసులో స్వశక్తితో నిలబడి సేవా రంగంలో పనిచేస్తున్న ఓ యువతి ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరమని సీతక్క పేర్కొన్నారు. మహిళలపై ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

శిరీష కుటుంబ సభ్యులకు మంత్రి సీతక్క ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.