మక్తల్, వెలుతురు : అక్టోబర్ 07
మక్తల్ పట్టణంలో 4 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఇరిగేషన్ భవన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. అధికారులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యాలయాలు, సిబ్బంది విధుల నిర్వహణకు మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో భవనాన్ని నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతుల అభివృద్ధితో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.
