శ్రీరాములపల్లి: హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘పల్లె పల్లెకు పొన్నం అన్న–పల్లె పల్లెలో ప్రజాపాలన’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కార్యక్రమంలో భాగంగా శ్రీరాములపల్లి గ్రామాన్ని సందర్శించిన మంత్రి.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలోని 173 గ్రామాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా అందుతున్నాయా లేదా పరిశీలించడంతో పాటు, స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేసి త్వరలోనే నీటిని అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు ద్వారా 714 ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులకు సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల వంటి ప్రభుత్వ పథకాలను అందిస్తామని చెప్పారు. గ్రామం అభివృద్ధి చెందితేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
