కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. నిర్మాణ పరికరాల తయారీకి రూ.11 వేల కోట్లు 

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. నిర్మాణ పరికరాల తయారీకి రూ.11 వేల కోట్లు

 

న్యూఢిల్లీ, వెలుతురు, నవంబర్ 25 :

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (నవంబర్ 25) జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిర్మాణ పరికరాల తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.11 వేల కోట్లతో ప్రత్యేక పథకానికి ఆమోదం తెలిపింది. అలాగే అస్సాంలోని సిల్చార్‌ సమీపంలోని డూలూ ప్రాంతంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి రూ.2,014 కోట్ల నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయం ద్వారా బరాక్‌ లోయతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు విమాన, సరకు రవాణా కనెక్టివిటీ మెరుగుపడనుంది.

 

ఐదు కీలక ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం

 

మొత్తం రూ.19,934 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు

 

– నిర్మాణ పరికరాల తయారీ రంగానికి రూ.11,000 కోట్లు

– తమిళనాడులోని కామరాజర్ పోర్టులో రెండో కంటైనర్ టెర్మినల్‌కు రూ.4,288 కోట్లు

– అస్సాంలోని సిల్చార్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి రూ.2,014 కోట్లు

– తపాలా కార్యకలాపాల పథకం కొనసాగింపునకు రూ.1,141 కోట్లు

– తపాలా శాఖ ఆస్తుల నిర్వహణ పథకానికి రూ.1,491 కోట్లు

 

దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి, రవాణా మౌలిక సదుపాయాలు, తపాలా సేవలను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో మొత్తం రూ.19,934 కోట్ల విలువైన ఐదు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాలను వెల్లడించారు.

 

నిర్మాణ పరికరాల తయారీకి ప్రోత్సాహం: నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన పరికరాల దేశీయ తయారీని పెంచేందుకు రూ.11 వేల కోట్లతో ఎనిమిదేళ్ల ప్రత్యేక పథకాన్ని ఆమోదించారు. టన్నెల్ బోరింగ్ యంత్రాలు, ఎక్స్‌కవేటర్లు, క్రేన్లు, లోడర్లు తదితర పరికరాల తయారీకి ప్రోత్సాహకాలు అందించనున్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశీయ పరిశ్రమలకు ఊతమివ్వడం ఈ పథకం లక్ష్యం.

 

పోర్టు సామర్థ్యం పెంపు: తమిళనాడులోని కామరాజర్ పోర్టులో రూ.4,288.26 కోట్లతో రెండో కంటైనర్ టెర్మినల్ నిర్మించనున్నారు. ఏటా 20 లక్షల కంటైనర్ల నిర్వహణ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టనున్నారు.

 

అస్సాంలో కొత్త విమానాశ్రయం: సిల్చార్‌లోని డూలూ ప్రాంతంలో రూ.2,014 కోట్లతో కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించనున్నారు. దీని ద్వారా బరాక్ లోయతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు విమాన, సరకు రవాణా సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.

 

తపాలా శాఖకు నిధులు: తపాలా కార్యకలాపాల పథకం కొనసాగింపునకు రూ.1,141 కోట్లు, తపాలా శాఖ ఆస్తుల నిర్వహణ పథకానికి రూ.1,491 కోట్లు కేటాయించారు. ఈ నిర్ణయాలతో దేశవ్యాప్తంగా తపాలా మౌలిక సదుపాయాలు, సేవల నిర్వహణను మరింత బలోపేతం చేయనున్నారు.