ఈటల రాజేందర్ పాదయాత్రకు పోలీసుల నిరాకరణ 

ఈటల రాజేందర్ పాదయాత్రకు పోలీసుల నిరాకరణ

 

మేడ్చల్, వెలుతురు, అక్టోబర్ 27 : మల్కాజ్‌గిరి ఎంపీ, భారతీయ జనతా పార్టీ నేత ఈటల రాజేందర్ తలపెట్టిన “మహా పాదయాత్ర”కు పోలీసులు అనుమతి నిరాకరించారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలనే ప్రధాన డిమాండ్‌తో ఈరోజు ఉదయం ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ నుంచి నాలుగు రోజుల పాటు ఈ పాదయాత్ర జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా ఈటల రాజేందర్ ఉదయాన్నే ఏదులాబాద్ చేరుకుని, స్థానిక రంగనాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 5,000 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి యాత్రను ప్రారంభించేందుకు సిద్ధమవుతుండగా, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసుల చర్యపై ఈటల రాజేందర్ తీవ్రంగా స్పందించారు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకునే హక్కు తనకుందని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసి అనుమతి కోరినట్లు వెల్లడించారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఇదే జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై పార్లమెంటులో మాట్లాడారని ఈటల గుర్తుచేశారు. నాడు రేవంత్ రెడ్డి లేవనెత్తిన అంశంపైనే ఇప్పుడు తాను పాదయాత్ర చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో పాదయాత్ర ముందుకు సాగుతుందా? లేదా? అనే దానిపై అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో ఏదులాబాద్‌లో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.