తుమ్మిడిహట్టి పేరుతో కొత్త డ్రామా : బాల్క సుమన్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 27 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యలను పక్కదారి పట్టించేందుకే తుమ్మిడిహట్టి ప్రాజెక్టు పేరుతో కొత్త నాటకానికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీరు, విద్యుత్ అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువని విమర్శించారు.
మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చల అనంతరం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. అక్కడ నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తించాలని అన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రభుత్వం బహిర్గతం చేసి, ఎన్ని ఎకరాలకు నీరు అందిస్తారో, ఎంత ఖర్చవుతుందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులపై కూడా ప్రభుత్వం పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు.
కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి రాజకీయ డ్రామా చేస్తున్నాయని, మేడిగడ్డకు నీరు ఇవ్వకపోవడంలో ఇరు పార్టీలకూ బాధ్యత ఉందని ఆరోపించారు. వరి విత్తనాల విక్రయాలపై డీలర్లకు నోటీసులు ఇవ్వడం, రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ కోరడం సరికాదన్నారు. “ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు” అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. సమావేశంలో కే. కిషోర్ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.
