దళితులు, గిరిజనులపై దాడులను అరికట్టాలని డీజీపీకి వినతి
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 27 :
రాష్ట్రంలో దళితులు, గిరిజనులపై పెరుగుతున్న అట్రాసిటీ ఘటనలను అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డీజీపీని కోరారు. మేడే రాజీవ్ సాగర్, రాంబాల్ నాయక్‌తో కలిసి డీజీపీని కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో గత మూడేళ్లలో 9,102 అట్రాసిటీ కేసులు నమోదుకాగా, 213 మంది ఎస్సీ, ఎస్టీలు హత్యకు గురయ్యారని తెలిపారు. 1,305 మంది బాలికలు, మహిళలపై లైంగిక దాడి కేసులు నమోదైనా కేవలం 32 కేసుల్లోనే శిక్షలు పడటం ఆందోళనకరమన్నారు. ఫిర్యాదులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో పాటు పెండింగ్ కేసులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు సత్వర న్యాయం, భద్రత కల్పించాలని కోరారు.
