మూసీ పునరుజ్జీవనం, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్‌కు కొత్త రూపు ‎

‎మూసీ పునరుజ్జీవనం, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్‌కు కొత్త రూపు

‎

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 30 :  హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాలకు దీటుగా తీర్చిదిద్దడంతో పాటు, తెలంగాణను దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. నగరాభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల పాత్ర అత్యంత కీలకమని, ఈ రంగంలో ఉన్నవారిని కేవలం వ్యాపారవేత్తలుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా ప్రభుత్వం గుర్తిస్తోందని అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో నిర్వహించిన నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

‎

‎హైదరాబాద్‌కు దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అనేక అనుకూలతలు ఉన్నాయని, మోస్ట్ లివబుల్ సిటీగా గుర్తింపు పొందిన ఈ నగరంలో స్థిరపడేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు కల్పించిన మౌలిక సదుపాయాలను మరింత విస్తరిస్తూ ప్రస్తుత ప్రభుత్వం నగరాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, బీహెచ్‌ఈఎల్, బీడీఎల్, ఈసీఐఎల్, డీఆర్‌డీఓ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, ఐఐటీ, ఐఐఐటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు నగర అభివృద్ధికి బలమైన పునాదులుగా నిలిచాయని పేర్కొన్నారు.

‎

‎రూ.84,790 కోట్లతో నగరాభివృద్ధికి బృహత్తర ప్రణాళిక

‎

‎హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం సుమారు రూ.84,790 కోట్లతో భారీ కార్యాచరణను రూపొందించిందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇందులో ఇప్పటికే సుమారు రూ.55 వేల కోట్ల పనులకు సంబంధించి డిజైన్లు, టెండర్ల ప్రక్రియ చేపట్టడంతో పాటు పలు పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. రానున్న రోజుల్లో నగరంలోని ప్రతి ప్రాంతంలో అభివృద్ధి పనులు, నిర్మాణ కార్యక్రమాలు కనిపిస్తాయని చెప్పారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, మెట్రో రైలు తదితర మౌలిక సదుపాయాల కోసం రూ.52,706 కోట్లు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు రూ.15,849 కోట్లు కేటాయించి పనులు ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.4 వేల కోట్లు, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.2,500 కోట్లు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ.2,163 కోట్లు, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా రహదారుల అభివృద్ధికి రూ.500 కోట్లతో పనులు చేపడుతున్నట్లు వివరించారు.

 

‎మూసీ పునరుజ్జీవనంతో నగరానికి కొత్త ఆభరణం

‎

‎మూసీ నదిని మురికి కూపం నుంచి స్వచ్ఛమైన జలాలతో ప్రవహించే నదిగా మార్చి హైదరాబాద్‌కు గొప్ప ఆస్తిగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన నగరాలు తమ మధ్యలో ప్రవహించే నదులను శుద్ధి చేసి పర్యాటక, ఆర్థిక కేంద్రాలుగా అభివృద్ధి చేసుకున్నాయని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా తొలి దశలో సుమారు రూ.7,500 కోట్ల పనులను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెప్పారు. మూసీలోకి మురుగునీరు చేరకుండా నగరంలోని 21 ప్రధాన నాలాల వద్ద ఒకేసారి మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి, టెండర్ల ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఎస్టీపీల సంఖ్యను 38కు పెంచే ఆలోచన ఉందన్నారు. శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలు, ఉద్యానవనాల నిర్వహణకు వినియోగించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని వెల్లడించారు. మూసీ నది భవిష్యత్తులో హైదరాబాద్‌కు అతిపెద్ద ఆభరణంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

 

‎భారత్ ఫ్యూచర్ సిటీతో అభివృద్ధికి నూతన దిశ

‎

‎సుమారు 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో 15 వేల ఎకరాలను పచ్చదనం, విశాలమైన బహిరంగ ప్రదేశాల కోసం కేటాయించడం విశేషమన్నారు. మొత్తం భూభాగంలో 50 శాతం గ్రీన్ స్పేస్‌గా ఉంచుతూ నగర నిర్మాణం చేపట్టడం దేశంలోనే ప్రత్యేకతగా నిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా భారత్ ఫ్యూచర్ సిటీ మరో కీలక అభివృద్ధి కేంద్రంగా రూపుదిద్దుకోనుందని పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు హైదరాబాద్ భవిష్యత్తును మార్చనున్నాయని తెలిపారు. నగరాభివృద్ధికి అవసరమైన నీటి వనరుల విషయంలోనూ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, కృష్ణా, గోదావరి జలాలను నగరానికి తీసుకువచ్చే ప్రణాళికలు హైదరాబాద్ విస్తరణకు దోహదపడ్డాయని గుర్తుచేశారు.

 

‎కాలుష్య నియంత్రణకు హిల్ట్ పాలసీ

‎

‎హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు హిల్ట్ పాలసీని తీసుకొచ్చినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని పరిశ్రమలను దశలవారీగా బయటకు తరలించడం ద్వారా నగరంలో కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రజా రవాణాలో డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడంతో పాటు, ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు సబ్సిడీతో కూడిన సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణ, ఆధునిక రవాణా వ్యవస్థల సమన్వయంతో హైదరాబాద్‌ను మరింత నివాసయోగ్యమైన నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు.

‎

‎రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి రూ.93 వేల కోట్లు

‎

‎హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు సుమారు రూ.93 వేల కోట్లతో రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. నాలుగు వరుసల రహదారులు, ఫ్లైఓవర్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. నగరాభివృద్ధితో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

‎

‎సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమ ప్రాధాన్యం

‎

‎రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు భారీ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు వెచ్చిస్తూనే మరోవైపు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని భట్టి విక్రమార్క వివరించారు. రాష్ట్రంలో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు. 1.06 కోట్ల కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ, అర్హులైన కుటుంబాలకు రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 41 లక్షల కుటుంబాలకు చేయూత పథకం ద్వారా ప్రయోజనాలు అందిస్తున్నామని చెప్పారు.

‎ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు. వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందించేందుకు రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు బదిలీ చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి, అది తిరిగి వ్యాపార, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.

 

‎నిర్మాణ రంగానికి అవసరమైన నైపుణ్య మానవ వనరులు

‎

‎రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనతో ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి తరగతులు కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్ రూపొందించడం, శిక్షణ ఇచ్చే అధ్యాపకులను ఎంపిక చేయడం వంటి బాధ్యతలను పరిశ్రమల ప్రతినిధులకే అప్పగించినట్లు చెప్పారు. శిక్షణ పూర్తిచేసిన యువతకు పరిశ్రమల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు.

‎రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని, ఆధునిక యంత్రాలు, నిర్మాణ రంగ సాంకేతికతలపై యువతకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు, ప్రతిభ కలిగిన యువతను ప్రభుత్వమే శిక్షణ ఇచ్చి అందించేందుకు సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. నగరంలో లగ్జరీ గృహాలతో పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు నిర్మించే అంశంపై కూడా దృష్టి సారించాలని పరిశ్రమ వర్గాలకు సూచించారు. గతంలో హౌసింగ్ బోర్డు ద్వారా నిర్మించిన ఎంఐజీ, ఎల్‌ఐజీ గృహాలు అనేక కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాయని గుర్తుచేశారు. అదే తరహాలో దీర్ఘకాలిక ప్రణాళికతో అందుబాటు గృహ నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి ప్రయాణంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ ప్రతినిధులు భాగస్వాములై సంపద సృష్టికర్తలుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ విధానాలు, భారీ మౌలిక సదుపాయాల పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల సమన్వయంతో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా, తెలంగాణను దేశంలోనే అగ్రగామి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.