లక్ష మందికి ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లో శిక్షణ

లక్ష మందికి ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ లో శిక్షణ

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 02 :  రాష్ట్రంలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ప్రభుత్వంపై గానీ, కళాశాలలు లేదా విద్యార్థులపై గానీ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ‘తెలంగాణ ఏఐ అండ్ క్లౌడ్ స్కిల్లింగ్ ఇనిషియేటివ్’లో భాగంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్(ఏడబ్ల్యూఎస్) సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. ఇందుకు సంబంధించిన ఒప్పందం సోమవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో టాస్క్, ఏడబ్ల్యూఎస్ మధ్య జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. రాష్ట్రంలోని 643 టాస్క్ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులకు ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐ తదితర ఇండస్ట్రీ ఓరియెంటెడ్ అంశాల్లో శిక్షణ ఇస్తామన్నారు. ప్రత్యక్షంగా ప్రాక్టికల్స్ చేసేందుకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కన్సోల్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇంజినీరింగ్, సైన్స్ విద్యార్థులతో పాటు ఆర్ట్స్, కామర్స్ తదితర నాన్ స్టెమ్ కోర్సుల విద్యార్థులకు కూడా ప్రత్యేక లెర్నింగ్ ట్రాక్స్ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి ‘ఏడబ్ల్యూఎస్ స్కిల్ బిల్డర్’ ద్వారా 900 కంటే ఎక్కువ డిజిటల్ కోర్సులను ఏడాది పాటు ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్లోబల్ సర్టిఫికేషన్ పరీక్షల కోసం డిస్కౌంట్ వోచర్లను కూడా అందిస్తామన్నారు. విద్యార్థులకు సాంకేతిక నిపుణులతో ఇండస్ట్రీ కనెక్ట్ సెషన్లు, హ్యాకథాన్లను నిర్వహిస్తామన్నారు. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అర్హులైన విద్యార్థులకు టాస్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఆయా కళాశాల్లోని అధ్యాపకులకు కూడా ఏఐ, క్లౌడ్ సాంకేతికతలో ప్రపంచస్థాయి శిక్షణ అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టా రెడ్డి, టాస్క్ సీఈవో నితిన్ రెడ్డి , ఏడబ్ల్యూఎస్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ సందీప్ దత్తా, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ హెడ్ అభినవ్, కంట్రీ మేనేజర్(స్కిల్లింగ్ & సోషల్ ఇంపాక్ట్) ప్రతిభా, ఏడబ్ల్యూఎస్ అకాడమీ టీపీఎం ఆకాంక్ష రాయ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.