అమిత్ షాకు ఘన స్వాగతం పలికిన బండి సంజయ్ కుమార్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 02 : కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న అమిత్ షాకు బండి సంజయ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. అమిత్ షా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. ఈ పర్యటనలో భాగంగా నగరంలోని బషీర్‌బాగ్‌లో ఉన్న డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొజాంజాహి మార్కెట్ (ఎంజే మార్కెట్) వరకు నిర్వహించనున్న మహా పాదయాత్రలో అమిత్ షా పాల్గొననున్నారు.
‘లోక్తంత్ర బచావో – అరాచకత హటావో’
నినాదంతో నిర్వహిస్తున్న ఈ పాదయాత్ర ద్వారా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పడమే లక్ష్యంగా బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
పాదయాత్ర అనంతరం ఎంజే మార్కెట్ వద్ద జరిగే కార్నర్ మీటింగ్‌లో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్‌తో పాటు పలువురు పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో పాదయాత్ర మార్గంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు కూడా అమలు చేస్తున్నారు. ఈ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
