జీవో 14ను వెంటనే ఉపసంహరించుకోవాలి: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

జీవో 14ను వెంటనే ఉపసంహరించుకోవాలి: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 06 : బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలపై ప్రభుత్వం పెత్తనం చెలాయించడం సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు. బీసీ భవనాల నిర్వహణ బాధ్యతలను అధికారుల కమిటీలకు అప్పగిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 14ను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తదితరులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో జీవో ప్రతులను చించివేసి నిరసన తెలిపారు. కేసీఆర్ హయాంలో 41 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం భూములు, నిధులు కేటాయించగా, ప్రస్తుత ప్రభుత్వం వాటిపై అధికారుల ఆధిపత్యం తీసుకురావడం బీసీల హక్కులను కాలరాయడమేనన్నారు. కుల సంఘాలతో సంప్రదింపులు లేకుండా జీవో తీసుకురావడం, భవనాల్లో ప్రభుత్వ వ్యతిరేక సమావేశాలపై ఆంక్షలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జీవో 14ను వెంటనే ఉపసంహరించుకోకపోతే బీసీ సంఘాలతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.