తెలంగాణ విద్యార్థిని శ్రీజ ఆచూకీ కోసం మంత్రి కోమటిరెడ్డి ఆరా

తెలంగాణ విద్యార్థిని శ్రీజ ఆచూకీ కోసం మంత్రి కోమటిరెడ్డి ఆరా

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 13 :

 

అమెరికాలోని బోస్టన్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లి అదృశ్యమైన తెలంగాణ విద్యార్థిని కోయ శ్రీజ ఆచూకీని కనుగొనేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. గడిచిన పది రోజులుగా ఈ ఘటనను తాను, తన కార్యాలయ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

 

ఒక సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన శ్రీజ అదృశ్యం కావడం అత్యంత దురదృష్టకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీజ తల్లిదండ్రులు తనకు ఎంతో పరిచయస్తులని, వారి ఆవేదనను అర్థం చేసుకుని మొదటి రోజు నుండే అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

 

శ్రీజ ఆచూకీ కోసం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ గారితో ఇప్పటికే మాట్లాడటంతో పాటు, అధికారికంగా లేఖలు రాసి నిరంతరం ఫాలో అప్ చేస్తున్నట్లు మంత్రి వివరించారు. అమెరికాలోని కాన్సులేట్ అధికారులతో పాటు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతినిధి కృష్ణ ప్రసాద్ గారు మరియు వారి బృందం బోస్టన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. శ్రీజ ఫోన్ లొకేషన్ గుర్తించడంతో ఆమె క్షేమంగా దొరుకుతుందనే ఆశ ఇంకా ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ భగవంతుడి దయవల్ల శ్రీజ క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు తిరిగి రావాలని తాను ప్రార్థిస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.