భారత్ సమ్మిట్ విజయాన్ని చూసి బీఆర్ఎస్ నేతల అసూయ : మహేశ్ కుమార్ గౌడ్
హైదరాబాద్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై కేటీఆర్ ముందుగా ఆత్మపరిశీలన చేసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హితవు పలికారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి, దళితుడిని ఉప ముఖ్యమంత్రిగా నియమించి రాత్రికి రాత్రే పదవి నుంచి తొలగించిన చరిత్ర బీఆర్ఎస్దని విమర్శించారు. హైడ్రా పేరుతో ఇళ్ల కూల్చివేతలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఒక్క ఇల్లు కూల్చినట్లు నిరూపించినా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీఆర్ఎస్కు ప్రజాదరణ తగ్గుతోందనడానికి నిర్మల్లో ఇటీవల జరిగిన సభే నిదర్శనమన్నారు. భారత్ సమ్మిట్ విజయాన్ని చూసి ఓర్వలేక ఆ పార్టీ నేతలు అసూయతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, మోదీ ప్రభుత్వం జర్నలిస్టుల వీసాలను రద్దు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఖండించాల్సిన అంశమని, మీడియా ప్రతినిధులంతా దీనిని నిరసించాలని మహేశ్ కుమార్ గౌడ్ కోరారు.
