బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 14 : బంజారాహిల్స్‌లోని బాబు జగ్జీవన్ రామ్ భవన్లో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన ఈ వేడుకల్లో పలువురు అధికారులు, బాలల హక్కుల కమిషన్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషన్ సభ్యులు చందన, గుగులోతు సరిత, వచన్తో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి శృతి ఓజా, కమిషనర్ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యరూపకాలు ఆహూతులను అలరించాయి.
ముఖ్యంగా మొబైల్ ఫోన్ దుర్వినియోగం, దాని వల్ల పిల్లలపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను వివరిస్తూ చిల్డ్రన్ హోమ్ చిన్నారులు ప్రదర్శించిన నాటకం అందరినీ ఆలోచింపజేసింది. మొబైల్ వినియోగంపై పిల్లలు, తల్లిదండ్రుల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని ఈ ప్రదర్శన చాటిచెప్పింది.
ఈ సందర్భంగా బాలల సంక్షేమం, రక్షణ, అభివృద్ధిని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టనున్న నూతన కార్యక్రమాలను మంత్రులు ఆవిష్కరించారు. బాలలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం, వారి హక్కులను కాపాడటం, విద్యా, సామాజిక అభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని కార్యక్రమం ద్వారా స్పష్టమైంది.
