రాహుల్ గాంధీ రేవంత్ సర్కార్ను నిలదీయాలి: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 14 :
హైదరాబాద్కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లపై సమీక్ష జరిపి, హామీల అమలుపై ముఖ్యమంత్రిని ప్రశ్నించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేర్లతో పథకాలు ప్రకటిస్తే సరిపోదని, వాటి ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినప్పుడే వారికి నిజమైన గౌరవం ఇచ్చినట్లవుతుందని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మూడు బడ్జెట్లు గడిచినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువత కోసం రూ.6 వేల కోట్లతో ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకం కూడా కాగితాలకే పరిమితమైందని ఆరోపించారు. పాత హామీలనే కొత్త బడ్జెట్లలో తిరిగి ప్రకటిస్తూ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. రాజకీయ నినాదాలు పక్కనపెట్టి, అమలుకాని మేనిఫెస్టో హామీలపై రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీసి జవాబుదారీతనం కోరాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
