రాహుల్ గాంధీ హామీలన్నీ గాలి మాటలే : బండి సంజయ్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 14 : రాహుల్ గాంధీ నోట పలికే హామీలన్నీ గాలి మాటలుగానే మిగిలిపోతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలతో పాటు వరంగల్, కామారెడ్డి డిక్లరేషన్ల అమలు ఏమైందని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు జర్నలిస్టులకే ఆరోగ్య భద్రత కల్పించలేని ప్రభుత్వం గిగ్ వర్కర్లకు ఏ విధంగా భరోసా ఇస్తుందని నిలదీశారు. ఆటో డ్రైవర్ల సంక్షేమాన్ని కూడా గాలికొదిలేసిందని ఆరోపించారు.
గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సరిపోదని, దానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన వివిధ సంక్షేమ బోర్డులకు ప్రభుత్వం ఎంతమేర నిధులు ఇచ్చిందో చెప్పాలన్నారు. రాజస్థాన్ తరహాలో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. రాజస్థాన్‌లో అగ్రిగేటర్ సంస్థల నుంచి ప్రతి లావాదేవీపై సంక్షేమ రుసుము వసూలు చేయడంతో పాటు, ఫిర్యాదుల పరిష్కారం, ఉల్లంఘనలకు జరిమానాలు విధించే విధానం ఉందని గుర్తుచేశారు. తెలంగాణలోనూ అలాంటి సౌకర్యాలు కల్పించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు.
ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు లభించక కుటుంబ పోషణ కోసం గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్న నిరుద్యోగుల పరిస్థితిని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. గిగ్ వర్కర్లు కాంగ్రెస్ హామీలకు మోసపోయే వారు కాదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారికి ప్రతినెలా భృతి అందించాలని, ఓలా, ఉబర్, స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల అధిక కమీషన్ల భారం లేకుండా కస్టమర్లు చెల్లించే మొత్తం వర్కర్లకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హులైన గిగ్ వర్కర్లకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా కేటాయించాలని బండి సంజయ్ కోరారు.
