ముగ్గురు మాజీ ఎమ్మెల్సీల సేవలు చిరస్మరణీయం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 14 : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగిన గోరేటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం ముగిసిన సందర్భంగా శనివారం అసెంబ్లీ కౌన్సిల్ బిల్డింగ్స్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తదితరులు ముగ్గురు సభ్యులను సత్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాకపోయినా ప్రజాసేవ చిరస్థాయిగా నిలుస్తుందని, ముగ్గురు సభ్యులు సభలో లేవనెత్తిన అంశాలు, అందించిన సేవలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని కొనియాడారు. పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవకు విరామం ఉండదని అన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ముగ్గురూ తమ తమ రంగాల్లో విశిష్ట సేవలందించారని, ఎమ్మెల్సీలుగా మాత్రమే పదవీ విరమణ చేశారని, ప్రజాసేవలో కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్మూరి వెంకట్, పలువురు ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.
