యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 15 : రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూముల కేటాయింపు, రాయితీలు, ప్రభుత్వపరంగా అందించే ప్రోత్సాహకాలను అర్హులైన పారిశ్రామికవేత్తలకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పారిశ్రామిక ప్రగతితో పాటు సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, సమ్మిళిత ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో ప్రముఖ కవి, వాగ్గేయకారుడు జయరాజుకు సంబంధించిన ఎన్ఎస్ ఇండస్ట్రీస్ ప్రారంభోత్సవానికి ఆదివారం ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపన ద్వారా యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ ఇండస్ట్రీస్‌ను స్థాపించిన యువ పారిశ్రామికవేత్తలు నిశాంత్, సాజన్ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా పరిశ్రమను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పది మందికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో వారు చేపట్టిన ఈ ప్రయత్నం మరెందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన పారిశ్రామిక ప్రాంతంలో స్థలాల కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించిందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు నిశాంత్, సాజన్ ఆదర్శంగా ఎదగాలని ఆకాంక్షించారు. వారి విజయాలు వ్యక్తిగత అభివృద్ధికే పరిమితం కాకుండా సమాజంలోని మరెందరికో ప్రేరణ కల్పించాలని అన్నారు.
ప్రముఖ కవి, వాగ్గేయకారుడు జయరాజు సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తన కళను సమాజ హితం కోసం వినియోగించడం గొప్ప విషయమన్నారు. సింగరేణి కార్మికుల సమస్యలు, శ్రమజీవుల హక్కులు, అణగారిన వర్గాల జీవితాలను తన పాటల ద్వారా ప్రతిబింబిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన రచించిన పాటలు ప్రజా ఉద్యమాలకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని గుర్తుచేశారు. కళాకారులు, మేధావులు, సామాజిక చైతన్యం కోసం పనిచేసే వ్యక్తులను గుర్తించి గౌరవించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తామని తెలిపారు.
పాలకులు అధికారాన్ని హోదాగా భావించకుండా ప్రజల సంక్షేమం, సమాజ హితం కోసం పనిచేయాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం కూడా సామాజిక న్యాయం, సమానత్వం, అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు.
పారిశ్రామిక అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉన్న చెట్లను తొలగించకుండా ప్రకృతిని కాపాడుతూ పరిశ్రమను అభివృద్ధి చేయాలనే ఎన్ఎస్ ఇండస్ట్రీస్ నిర్వాహకుల ఆలోచనను అభినందించారు. పర్యావరణ హిత పారిశ్రామిక ప్రగతి సాధించే దిశగా సంస్థ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేందర్ రావు, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి,
సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, డిక్కీ అధ్యక్షులు నర్రా రవికుమార్, స ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శివాజీ , స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
