ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలతోనే బ్రెయిన్ స్ట్రోక్ నివారణ : మధుయాష్కీ గౌడ్

ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలతోనే బ్రెయిన్ స్ట్రోక్ నివారణ : మధుయాష్కీ గౌడ్

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 15 :  బ్రెయిన్ స్ట్రోక్ పై అందరికీ అవగాహన అవసరమని.. ముందస్తు జాగ్రత్తలతో స్ట్రోక్ ను నివారించవచ్చని ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ గారు పేర్కొన్నారు.

 

“ఇండియన్ సొసైటీ ఫర్ బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెన్షన్” ఆధ్వర్యంలో సరళా దేవి ఫౌండేషన్, గౌతమ్ న్యూరో కేర్, యుజీ డ్రీమ్స్ సహకారంతో బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన కోసం ‘5కే రన్’ ను ఈ రోజు నెక్లెస్ రోడ్డులో నిర్వహించడం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన మధుయాష్కీ గౌడ్ గారు జెండా ఊపి రన్ ను ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా మధుయాష్కీ గారు మాట్లాడుతూ.. ఎంతోమంది యుక్త వయసులోనే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ లకు గురవుతున్నారన్నారు. అవగాహన లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల అనారోగ్యంతో ఆస్పత్రుల పాలై ఎంతోమంది అప్పుల పాలవుతున్నారన్నారు. ఒత్తిడిని నివారిస్తూ.. ముందస్తు జాగ్రత్తలు, వ్యాయామం, సరైన ఆహారపు అలవాట్ల వల్ల వాటిని నివారించవచ్చనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని మెలగాలని సూచించారు. తరచూ హెల్త్ చెకప్ లు చేయించుకోవాలని సూచించారు. డాక్టర్ ఉదయ్ గౌతమ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని బ్రెయిన్ స్ట్రోక్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా 5కే రన్ విజేతలకు బహుమతులు, మెడల్స్ ను మధుయాష్కీ గారు అందజేశారు.