హుస్నాబాద్‌లో రేపటి నుంచి దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాలు
హుస్నాబాద్, వెలుతురు, నవంబర్ 15 : నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచితంగా సహాయ ఉపకరణాలు అందించేందుకు నవంబర్ 16 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏడు మండలాలు, హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఏఎల్ఐఎంసీఓ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఏడీఐపీ పథకం కింద ఈ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా అర్హులకు వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, వాకింగ్ స్టిక్స్ తదితర ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. 80 శాతానికి పైగా వైకల్యం ఉన్న అర్హులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లు అందించనున్నారు. అన్ని శిబిరాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని, అర్హులైన దివ్యాంగులు, వృద్ధులు నిర్ణీత తేదీల్లో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
శిబిరాల వివరాలు: నవంబర్ 16న సైదాపూర్, 17న ఎల్కతుర్తి, 18న అక్కన్నపేట, 20న కోహెడ, 21న చిగురుమామిడి, 25న హుస్నాబాద్ రూరల్, 26న హుస్నాబాద్ టౌన్, 27న భీమదేవరపల్లి మండలాల్లో శిబిరాలు నిర్వహించనున్నారు. అర్హులైన వారిని గుర్తించి శిబిరాలకు తీసుకురావాలని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.
