యాదాద్రి వెలుగులతో తెలంగాణ విద్యుత్ రంగానికి కొత్త బలం

యాదాద్రి వెలుగులతో తెలంగాణ విద్యుత్ రంగానికి కొత్త బలం

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 17 :

రబీ సీజన్‌లో పూర్తి స్థాయి ఉత్పత్తికి TGGENCO సన్నద్ధం

తెలంగాణ విద్యుత్ రంగాన్ని మరింత పటిష్టం చేస్తూ, రాష్ట్ర విద్యుత్ అవసరాలను సమర్థంగా తీర్చే దిశగా ప్రజా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించింది. 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టులో ఇప్పటికే నాలుగు యూనిట్లు విజయవంతంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండగా, ఐదో యూనిట్ కూడా గ్రిడ్‌కు అనుసంధానమైంది. డిసెంబర్‌లో ఐదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. మరోవైపు బొగ్గు సరఫరా వ్యవస్థలోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి, రానున్న రబీ సీజన్‌లో ఐదు యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ (TGGENCO) సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోంది.

 

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ తెలంగాణ విద్యుత్ రంగానికి కీలకమైన ఆస్తిగా నిలవనుంది. ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంతో మొత్తం ఐదు యూనిట్లను ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు అనేక సవాళ్లను అధిగమించి ప్రారంభోత్సవ దశకు చేరుకుంది. కోవిడ్ మహమ్మారి, అటవీ అనుమతులు, రైల్వే భూముల సమస్యలతో పాటు పర్యావరణ అనుమతులకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాల కారణంగా పనుల్లో జాప్యం జరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్టును తిరిగి వేగవంతం చేసింది. పర్యావరణ ప్రభావ అంచనా అధ్యయనాలు, ప్రజాభిప్రాయ సేకరణను తిరిగి పూర్తి చేసి 2024 ఫిబ్రవరిలో పనులను పునఃప్రారంభించారు. ప్రభుత్వ నిరంతర పర్యవేక్షణ, అధికారుల సమన్వయంతో నాలుగు యూనిట్లు ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిలోకి వచ్చాయి. ఐదో యూనిట్‌ను అక్టోబర్ 20న గ్రిడ్‌కు అనుసంధానం చేయడంతో 4,000 మెగావాట్ల పూర్తి సామర్థ్యం అందుబాటులోకి రావడానికి మార్గం సుగమమైంది.

యాదాద్రి ప్లాంట్‌లో ప్రధాన ఉత్పత్తి వ్యవస్థలైన బాయిలర్, టర్బైన్, జనరేటర్‌తో పాటు బూడిద నిర్వహణ, నీటి సరఫరా వ్యవస్థలు సంతృప్తికరంగా పనిచేస్తున్నాయి. అయితే బొగ్గు నిర్వహణ ప్లాంట్‌లోని కొన్ని సాంకేతిక సమస్యలను గుర్తించిన ప్రభుత్వం వాటి పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని BHEL–TGGENCO ఉన్నతస్థాయి బృందం యాదాద్రి ప్లాంట్‌లోనే మకాం వేసి పరిస్థితులను సమీక్షించింది. TGGENCO సీఎండీ, BHEL డైరెక్టర్ (పవర్) తదితరులు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన లక్ష్యాలతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఫలితంగా నాలుగు బొగ్గు సరఫరా మార్గాలను పునరుద్ధరించి, ఒక్కో మార్గం ద్వారా గంటకు సగటున 800 టన్నుల చొప్పున మొత్తం 3,200 టన్నుల బొగ్గు సరఫరా చేసే స్థాయికి తీసుకొచ్చారు. దీంతో బొగ్గు సరఫరాలో అంతరాయాలు తగ్గి ప్లాంట్ పనితీరు మెరుగుపడింది.

ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు నిరంతరాయంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోంది. SCCLకు చెందిన నైనీ బొగ్గు గని నుంచి రోజుకు మూడు నుంచి నాలుగు రేకుల బొగ్గును తరలించే ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకు అక్కడి నుంచి 4.26 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును యాదాద్రికి తరలించారు. అదేవిధంగా MCL, SECL సంస్థల నుంచి విండో-II వేలం విధానం ద్వారా 4.6 లక్షల టన్నుల బొగ్గు కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుని, నవంబర్ 4న ఫ్యూయల్ సప్లై అగ్రిమెంట్లు పూర్తి చేశారు. ఈ సంస్థల నుంచి బొగ్గు రవాణా కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖలతో రాష్ట్ర ప్రభుత్వం, TGGENCO జరిపిన నిరంతర సంప్రదింపులు సత్ఫలితాలనిచ్చాయి. కోల్ ఇండియా అనుబంధ సంస్థలైన MCL, ECL నుంచి యాదాద్రి ప్లాంట్‌లోని రెండు యూనిట్లకు ఏడాదికి 7.71 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు స్టాండింగ్ లింకేజ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ దీర్ఘకాలిక సరఫరా ఏర్పాటుతో బొగ్గు పరిమాణం, నాణ్యతకు సంబంధించిన సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.

ప్రభుత్వం చేపట్టిన సమన్వయ చర్యలు, TGGENCO అధికారుల కృషి ఇప్పటికే సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి చరిత్రలోనే నవంబర్ 11న తొలిసారిగా 6,088 మెగావాట్ల ఆల్‌టైమ్ గరిష్ఠ ఉత్పత్తి నమోదైంది. ఇందులో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఒక్కటే 2,754 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ రంగంలో ఇది కీలక మైలురాయిగా నిలిచింది. యాదాద్రి ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగడంతో పాటు గ్రిడ్ అవసరాలను సమర్థంగా తీర్చేందుకు వీలవుతుంది.

బొగ్గు నిర్వహణ ప్లాంట్‌ను కూడా నిర్దేశిత సామర్థ్యంతో పనిచేసేలా తీర్చిదిద్దేందుకు TGGENCO మరో కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా నవంబర్ 18 నుంచి 24 వరకు తొలి బొగ్గు సరఫరా మార్గాన్ని దశలవారీ పునరుద్ధరణ పనుల కోసం షట్‌డౌన్ చేయనుంది. ఈ సమయంలో మిగిలిన మూడు సరఫరా మార్గాలను నిరంతరాయంగా అందుబాటులో ఉంచి నాలుగు యూనిట్ల ద్వారా 2,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించింది. అవసరమైతే SLDCతో సమన్వయం చేసుకుంటూ ఉత్పత్తిని 1,800 మెగావాట్లకు నియంత్రించేలా ముందస్తు ఏర్పాట్లు చేసింది. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా మరమ్మతులు నిర్వహించడమే ఈ ప్రణాళిక ప్రత్యేకత.

BHEL, TGGENCO సంస్థలు PMPL, BTL, L&T అనుబంధ సంస్థల సహకారంతో ఈ పనులను చేపట్టనున్నాయి. కన్వేయర్ బెల్టులు, వైబ్రేటింగ్ గ్రిజ్లీ ఫీడర్లు, క్రషర్లు, బెల్ట్ ఫీడర్లు, స్టాకర్, రీక్లెయిమర్ తదితర విభాగాల్లో సమగ్ర పునరుద్ధరణ పనులు చేపట్టనున్నారు. అవసరమైన విడిభాగాలను ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ పనుల అనంతరం గంటకు 2,500 టన్నుల బొగ్గు రవాణా సామర్థ్యాన్ని BHEL సంస్థ ప్రదర్శించి నిరూపించాల్సి ఉంటుంది. తొలి మార్గం మరమ్మతులు పూర్తయిన తర్వాత మిగిలిన మార్గాలను కూడా ఇదే తరహాలో దశలవారీగా పునరుద్ధరించనున్నారు.

ఒకవైపు బొగ్గు సరఫరా వ్యవస్థను పటిష్టం చేస్తూ, మరోవైపు ఐదో యూనిట్ వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమవుతున్న నేపథ్యంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ త్వరలోనే పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. నైనీ, MCL, ECL నుంచి దీర్ఘకాలిక బొగ్గు సరఫరా ఏర్పాట్లు, ఆధునికీకరణ చర్యలు, ప్రభుత్వ ఉన్నతస్థాయి పర్యవేక్షణతో రానున్న రబీ సీజన్‌లో 4,000 మెగావాట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు TGGENCO సన్నద్ధమవుతోంది. రాష్ట్ర విద్యుత్ స్వావలంబనకు మరింత బలాన్నిస్తూ, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను సమర్థంగా ఎదుర్కొనే దిశగా యాదాద్రి ప్లాంట్ కీలక పాత్ర పోషించనుంది.