ఫోటో జర్నలిస్టులు చరిత్రను కళ్లకు కట్టే యోధులు: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 21: ఫోటో జర్నలిస్టులు చరిత్రను కళ్లకు కట్టే యోధులని, ఒక్క ఫోటో వేల భావాలను ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లగలదని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫోటో జర్నలిస్టుల అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫోటో జర్నలిజం సమాజంలో మార్పునకు, ప్రజా సమస్యల వెలుగులోకి తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఫోటో జర్నలిస్టులు నూతన నైపుణ్యాలను అలవర్చుకోవాలని, మార్ఫింగ్, నకిలీ చిత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫోటో జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఖాజా విరాహత్ అలీ మాట్లాడుతూ ఫోటో జర్నలిస్టులు ఐక్యతతో ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని అన్నారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
2026 రాష్ట్ర స్థాయి ఉత్తమ వార్తా ఫోటోగ్రఫీ పోటీల్లో డెక్కన్ క్రానికల్‌కు చెందిన కే. దుర్గారావు ప్రథమ బహుమతి రూ.10 వేలు, సాక్షికి చెందిన కె. భజరంగ ప్రసాద్ ద్వితీయ బహుమతి రూ.7 వేలు, ఈనాడుకు చెందిన పొన్న శ్రీనివాస్ తృతీయ బహుమతి రూ.5 వేలు అందుకున్నారు. మరో పది మంది ఫోటో జర్నలిస్టులకు కన్సొలేషన్ బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేవులపల్లి అమర్, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. రామనారాయణ, ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు గంగాధర్, సంఘం ప్రతినిధులు, వివిధ మీడియా సంస్థల జర్నలిస్టులు పాల్గొన్నారు.
