గాంధీ హాస్పిటల్ ఐవీఎఫ్ కేంద్రం కొత్త వెలుగులు
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 21 : ఏళ్ల తరబడి సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతుల జీవితాల్లో గాంధీ హాస్పిటల్ ఐవీఎఫ్ కేంద్రం కొత్త వెలుగులు నింపుతోందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్ చికిత్స ద్వారా ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న పలువురు దంపతులకు పిల్లలు జన్మించడం సంతోషకరమని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు గాంధీ ఐవీఎఫ్ సెంటర్ డాక్టర్లు, సిబ్బందిని అభినందిస్తూ శనివారం మంత్రి ట్వీట్ చేశారు.
వరంగల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన ముగ్గురు దంపతులు గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్ చికిత్స ద్వారా సంతాన భాగ్యం పొందారని మంత్రి చెప్పారు. వీరిలో కొందరు తొమ్మిదేళ్ల నుంచి పదహారేళ్ల వరకు సంతానం కోసం ఎదురుచూసిన వారున్నారని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా ఫలితం పొందలేకపోయిన దంపతులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా అందిస్తున్న ఐవీఎఫ్ చికిత్స ఎంతో ఊరటనిస్తోందన్నారు. తొమ్మిదేళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తున్న ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగ శిశువులకు జన్మనిచ్చారని మంత్రి గుర్తు చేశారు. 32 వారాలకే ప్రసవం జరగడంతో శిశువులకు నెలలపాటు వైద్యులు వైద్య సేవలు అందించి, సంపూర్ణ ఆరోగ్యంతో శిశువులను ఇంటికి పంపించడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయాల వెనుక నిరంతరం కృషి చేస్తున్న గాంధీ హాస్పిటల్ వైద్యులు, ఐవీఎఫ్ నిపుణులు, ఎంబ్రియాలజిస్టులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అంకితభావంతో, మానవీయ దృక్పథంతో సేవలందిస్తున్న వైద్య బృందం కృషి అభినందనీయమని అన్నారు.
ఆర్థిక ఇబ్బందులు సంతాన సాఫల్యానికి అడ్డంకిగా మారకూడదని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఫెర్టిలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గాంధీ, పేట్లబురుజు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐవీఎఫ్ సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, దశలవారీగా జిల్లాలకు కూడా ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను కల్పిస్తూ, పేద కుటుంబాలకు ఖరీదైన వైద్య చికిత్సలను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.
