తెలంగాణలో భూముల రీ సర్వేకు రంగం సిద్ధం

తెలంగాణలో భూముల రీ సర్వేకు రంగం సిద్ధం

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 21 :   రాష్ట్రంలోని భూ రికార్డులను క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా సరిచేసేందుకు తెలంగాణ ప్రభుత్వం భూముల రీ సర్వేకు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో భూముల పునఃసర్వే నిర్వహణకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం ప్రక్రియను ఆరు దశల్లో పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

 

రీ సర్వేలో భాగంగా భూముల విస్తీర్ణం, సరిహద్దులు, పట్టాదారుల వివరాలు, ఉమ్మడి ఖాతాలు, భూ స్వాధీన పరిస్థితులను పరిశీలించనున్నారు. సర్వేకు కనీసం నాలుగు రోజుల ముందే రైతులకు నోటీసులు అందజేయనున్నారు. గ్రామసభల ద్వారా సర్వే విధానంపై అవగాహన కల్పించి, రైతుల సమక్షంలో భూముల కొలతలు చేపట్టనున్నారు. కొలతలు పూర్తయిన వెంటనే వాస్తవ విస్తీర్ణాన్ని రైతులకు తెలియజేస్తారు.

 

రికార్డుల్లో నమోదైన విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి మధ్య తేడాలు, ఉమ్మడి ఖాతాలు, సరిహద్దు వివాదాలు, ఎల్‌పీఎం సమస్యలను ప్రత్యేకంగా గుర్తించనున్నారు. తహశీల్దార్లు సర్వే నివేదికలను పరిశీలించి, అవసరమైన గ్రామాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అభ్యంతరాలను పరిష్కరించనున్నారు.

 

ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, అటవీ భూముల సరిహద్దులను కూడా గుర్తించి ఆక్రమణల నివారణకు చర్యలు తీసుకోనున్నారు. రైతుల అభ్యంతరాలు, అప్పీళ్ల పరిష్కారం అనంతరం తుది గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, సవరించిన భూ వివరాలను భూ భారతి పోర్టల్‌లో నమోదు చేయనున్నారు.

 

వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోనూ ఈ రీ సర్వే కీలకం కానుంది. పాత రెవెన్యూ రికార్డులు, వాస్తవ భూ విస్తీర్ణాల మధ్య వ్యత్యాసాలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ ప్రక్రియ ద్వారా పరిష్కారం లభించే అవకాశం ఉంది. అయితే సర్వే పేరుతో రైతుల హక్కులకు భంగం కలగకుండా పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.