బీజేపీ, కాంగ్రెస్ లు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 21 : ఖైరతాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, శ్రీనాథ్‌తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, శాంతిభద్రతలు, వైద్యం, విద్యారంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాల భర్తీ, పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.
