కార్యకర్తల త్యాగాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : ఉత్తమ్ 

కార్యకర్తల త్యాగాలతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది : ఉత్తమ్

హైదరాబాద్, నవంబర్ 23 : కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, త్యాగాల ఫలితంగానే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పదేళ్ల టీడీపీ, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పార్టీ కోసం దీర్ఘకాలంగా కష్టపడిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మూడేళ్ల కాంగ్రెస్ పాలన విజయవంతంగా కొనసాగుతోందని, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2024–2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కొనసాగాలనే లక్ష్యంతో పనిచేయాలని, రెండోసారి అధికారంలోకి రావడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ సందీప్‌తో చర్చించినట్లు తెలిపారు.

 

తెలంగాణ ప్రజలు, రైతాంగానికి మేలు జరిగేలా ప్రభుత్వం పనిచేస్తోందని, కృష్ణా, గోదావరి జలాల వినియోగం, వ్యవసాయ విస్తీర్ణం, వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణలో గణనీయమైన పురోగతి సాధించామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్‌ఎల్‌బీసీ, డిండి వంటి సాగునీటి ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. ఎన్నికల్లోపు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పేదలకు నాణ్యమైన సన్నబియ్యం పంపిణీతో పాటు అర్హులందరికీ రేషన్ కార్డులు అందించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.