మక్తల్ అభివృద్ధికి విద్యే పునాది.. 9 కోట్లతో నూతన డిగ్రీ కళాశాల నిర్మాణం

మక్తల్ అభివృద్ధికి విద్యే పునాది.. 9 కోట్లతో నూతన డిగ్రీ కళాశాల నిర్మాణం

 

మక్తల్, వెలుతురు, నవంబర్ 23 :  మక్తల్ ప్రాంత విద్యాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. మక్తల్‌లోని ఇరిగేషన్ కార్యాలయం వద్ద 9 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి రాష్ట్ర క్రీడా, యువజన సేవల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మక్తల్‌ను విద్యా, క్రీడా రంగాల్లో రాష్ట్రంలోనే ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.

సాధారణంగా డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి ప్రభుత్వం 6 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయిస్తుందని, అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో ప్రత్యేక చొరవ తీసుకొని మక్తల్ డిగ్రీ కళాశాల కోసం 9 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చానని తెలిపారు. గతంలో డిగ్రీ కళాశాల లేక ఎంతోమంది విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేసిన పరిస్థితి ఉండేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.ఇన్నేళ్లుగా మక్తల్‌కు డిగ్రీ కళాశాల ఎందుకు రాలేదో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆలోచించాలని ఆయన అన్నారు. గతంలో సరిపడా విద్యార్థులు లేరనే కారణంతో కళాశాలను రద్దు చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం మక్తల్‌లో 540 మంది విద్యార్థులు డిగ్రీ చదువుతుండటం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.

గతంలో మాదిరిగా కాకుండా భూమిపూజ చేసిన రోజే పనులు ప్రారంభించే అలవాటు తనదని, వచ్చే ఏడాది కార్తీక మాసంలో నూతన డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా త్వరలోనే మక్తల్‌కు పీజీ కళాశాలను కూడా తీసుకొస్తానని మంత్రి ప్రకటించారు. మక్తల్‌లో మినీ రవీంద్రభారతి ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ఈ ప్రాంతంలో పుట్టి, ఇదే ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం తన అదృష్టమని పేర్కొన్న మంత్రి.. నియోజకవర్గంలో సుమారు 2 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. అయితే ఇన్నేళ్లపాటు ఈ ప్రాంతం వెనుకబడి ఉండటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.