ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ : మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 23 : తెలంగాణలో కోటి ఓట్లు సాధించి 90 అసెంబ్లీ స్థానాల లక్ష్యంతో ముందుకు సాగుతామని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్‌లో నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్‌కు ఘన స్వాగతం పలికిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ కమిటీ సమావేశాల్లో సందీప్ పాల్గొన్నారని వెల్లడించారు.
సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సమగ్రంగా వివరించారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ముందుకు సాగుతారని చెప్పారు.
సాయంత్రం ఏఐసీసీ ఇన్‌ఛార్జి బి.ఎం. సందీప్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులతో విడివిడిగా సమావేశం కానున్నట్లు తెలిపారు. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు వెల్లడించారు.
ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26న సంవిధాన్ రక్షక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని లిబర్టీ చౌరస్తా వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
