2027 గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం

2027 గోదావరి పుష్కరాలకు 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం

హైదరాబాద్, నవంబర్ 23 : 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలను దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2027 జూన్ 26 నుంచి జూలై 27 వరకు జరిగే పుష్కరాలకు దేశ, విదేశాల నుంచి 8 కోట్ల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. 2017లో 5.5 కోట్ల మంది హాజరుకాగా, ఈసారి అంతకుమించి భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.1,115 కోట్లతో ఘాట్లు, ఆలయాలు, రహదారులు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో బాసర ఆలయ అభివృద్ధికి రూ.324 కోట్లు, భద్రాచలానికి రూ.276 కోట్లు, కాళేశ్వరానికి రూ.198 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 77 ప్రాంతాల్లో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పుష్కరాల లోగో, నినాదం రూపకల్పనకు ప్రజల నుంచి ఆహ్వానం పలికారు. ఉత్తమ లోగో, నినాదం రూపొందించిన వారికి వరుసగా రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 30 దరఖాస్తులకు చివరి తేదీగా ప్రకటించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, అధికారులు, జేఎన్‌ఎఫ్‌ఏయూ విద్యార్థులు పాల్గొన్నారు.