సిక్కు బంధువులకు గురునానక్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 24 : గురునానక్ ఒక మతానికి చెందిన గురువు మాత్రమే కాదని, యావత్ మానవాళికి మార్గదర్శకుడని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. గురునానక్ జయంతి సందర్భంగా సిక్కు బంధువులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
గురునానక్ ప్రపంచానికి మూడు గొప్ప సందేశాలను అందించారని పేర్కొన్నారు. నిజాయితీగా కష్టపడి పనిచేయడం (కీరత్ కరో), భగవంతుడిని స్మరించడం (నామ్ జపో), సంపాదించిన దానిని ఇతరులతో పంచుకోవడం (వండ్ చకో) ఆయన బోధించిన ప్రధాన సూత్రాలని వివరించారు. ఈ మూడు సూత్రాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరిస్తే సమాజంలో ఆకలి, అసమానతలు, విద్వేషాలకు చోటుండదని అన్నారు.
గురునానక్ దేవ్ బోధనలు చిరస్మరణీయమని, సిక్కు గురువుల త్యాగాలు అజరామరమని బండి సంజయ్ పేర్కొన్నారు. గురుద్వారాల్లో నిర్వహించే లంగర్ సంప్రదాయం ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. అక్కడ పేద, ధనిక, కుల, మత, హోదా భేదాలు లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చుని భోజనం చేయడం సమానత్వానికి నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. ఆకలితో వచ్చిన వ్యక్తికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని పేర్కొన్నారు. గురునానక్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
