రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి

రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి

 

రాజన్న సిరిసిల్ల, వెలుతురు, నవంబర్ 24 :  రోడ్డు ప్రమాదంలో తన వద్ద అటెండర్‌గా పనిచేసిన కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి మృతి చెందడంపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలోని హనుమాన్ నగర్ చౌరస్తా వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

 

వెంకయ్యకుంట వద్ద బైక్‌పై ప్రయాణిస్తున్న యువకులను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మణికుమార్ రెడ్డి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, రాత్రి 2 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

 

మణికుమార్ రెడ్డి మృతి వార్త తెలుసుకున్న కేసీఆర్ వెంటనే ముస్తాబాద్ మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావుతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తన వద్ద పనిచేసిన వ్యక్తి ప్రమాదంలో మృతి చెందడం పట్ల కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.