గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చేయాలి : మంత్రి దుద్దిళ్ల 

గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను వేగవంతం చేయాలి : మంత్రి దుద్దిళ్ల

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 24 :   భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన భారత్ ఫ్యూచర్ సిటీలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన వేదిక, ఎక్స్‌పో జోన్, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, రవాణా సౌకర్యాలు, కనెక్టివిటీ, అతిథులకు కల్పించాల్సిన వసతులపై అధికారులతో సమీక్షించారు.

 

తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంచేలా సమ్మిట్ ఏర్పాట్లు ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. సమ్మిట్ నిర్వహణకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఏర్పాట్లలో ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా అన్ని అంశాలను ముందస్తుగా పరిశీలించి పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.