జుక్కల్ మండలంలో చిరుత సంచారం
కామారెడ్డి, వెలుతురు, నవంబర్ 28 :
జుక్కల్ మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని కౌలాస్ అటవీ బీట్ పరిధిలో చిరుత సంచారానికి సంబంధించిన పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. సావర్గావ్ నుంచి లింగంపల్లి వెళ్లే రహదారి సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తుల నుంచి సమాచారం అందడంతో అటవీశాఖ బీట్ అధికారి రామచందర్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చిరుత పాదముద్రలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
సావర్గావ్-లింగంపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి వద్ద చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలు, అటవీ ప్రాంతాల వైపు వెళ్లవద్దని, చిరుత కనిపించినా లేదా ఆనవాళ్లు గుర్తించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. చిరుతను రెచ్చగొట్టడం, హాని తలపెట్టడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
