ఐవీఎఫ్‌ కేసులో కీలక పరిణామం

ఐవీఎఫ్‌ కేసులో కీలక పరిణామం

హైదరాబాద్‌, వెలుతురు, నవంబరు 28 :

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అక్రమ అండాల సేకరణ (ఐవీఎఫ్‌) వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతమైంది. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న బెగంపేటలోని ఓయాసిస్‌ ఫెర్టిలిటీ కేంద్రం కార్పొరేట్‌ కార్యాలయంలో మల్కాజిగిరి పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ల్యాప్‌టాప్‌లు, డిజిటల్‌ పరికరాలు, దాతల వివరాలు, రిఫరల్‌ పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.

 

కేసులో నిందితుడిగా ఉన్న ఎమిరిశెట్టి దుర్గాప్రసాద్‌ను కస్టడీలో విచారించిన అనంతరం పోలీసులు ఈ సోదాలు చేపట్టారు. మహిళలను గుర్తించి, వివిధ సహాయక పునరుత్పత్తి సాంకేతిక కేంద్రాలు (ఏఆర్‌టీ), ఫెర్టిలిటీ ఆసుపత్రులకు పంపించడంలో అతడి పాత్రపై ఆరా తీస్తున్నారు. అతడి సహచరులు, మధ్యవర్తులు, వైద్య కేంద్రాలతో ఉన్న సంబంధాలను పరిశీలిస్తున్నారు.

 

కోట్ల రూపాయల లావాదేవీలపై దృష్టి

 

ఓయాసిస్‌ ఫెర్టిలిటీ, సద్గురు హెల్త్‌కేర్‌ సంస్థల మధ్య జరిగినట్లు అనుమానిస్తున్న భారీ ఆర్థిక లావాదేవీలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. మహిళల నియామకం, అండాల సేకరణకు సంబంధించిన ప్రక్రియలు, మధ్యవర్తులకు చెల్లించిన కమీషన్లు, దాతలకు ఇచ్చిన మొత్తాల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. సద్గురు హెల్త్‌కేర్‌ సంస్థ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సంస్థతో సంబంధం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వెలువడినప్పటికీ, పోలీసులు అధికారికంగా ధ్రువీకరించలేదు.

 

చట్ట నిబంధనల ఉల్లంఘనపై విచారణ

 

అండాల దాతల నమోదు, వైద్య పరీక్షలు, సమ్మతి పత్రాలు, హార్మోన్‌ ఇంజెక్షన్ల వినియోగం తదితర అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. 2021 నాటి సహాయక పునరుత్పత్తి సాంకేతికత నియంత్రణ చట్టం నిబంధనలు పాటించారా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, డిజిటల్‌ ఆధారాలను ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపించనున్నారు.

 

43 మంది మహిళలకు విముక్తి

 

గత అక్టోబరు 31న ఈ వ్యవహారం వెలుగులోకి రాగా, వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు 43 మంది మహిళలను రక్షించారు. తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పేద, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను ఉద్యోగాలు, డబ్బు ఆశ చూపి అండాల సేకరణకు తీసుకొచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో మరిన్ని సంస్థలు, మధ్యవర్తుల పాత్ర వెలుగులోకి వచ్చే అవకాశముంది.