కేసీఆర్ నాయకత్వాన్ని స్మరించుకున్న మాజీ మంత్రి హరీష్ 

కేసీఆర్ నాయకత్వాన్ని స్మరించుకున్న మాజీ మంత్రి హరీష్

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 29 :

కేసీఆర్ నిరాహార దీక్ష చరిత్ర గతిని మార్చిందని, అమరవీరుల త్యాగాలు, కేసీఆర్ పోరాట పటిమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పేర్కొన్నారు. దీక్షా దివస్ సందర్భంగా ఆయన తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. కేసీఆర్ దీక్షాబలం, అమరుల త్యాగఫలమే నేటి తెలంగాణ రాష్ట్రానికి పునాదులని హరీశ్ రావు అన్నారు. తరతరాలుగా తెలంగాణ ప్రజలు కన్న కలను సాకారం చేసిన ఘనత కేసీఆర్ నిరాహార దీక్షకు దక్కుతుందని పేర్కొన్నారు. నిన్నైనా, నేడైనా, రేపైనా తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు.

ఆత్మబలాన్ని ఆయుధంగా, వాక్‌శక్తిని ఇంధనంగా, నిజాయితీ, నిబద్ధతలను కవచకుండలాలుగా చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చిన యోధుడు కేసీఆర్ అని కొనియాడారు. పదవులను వదులుకొని ప్రజలను ఏకం చేశారని, ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఢిల్లీ పాలకులపై ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు. అర్ధ శతాబ్దపు తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని గుర్తుచేశారు. భూమిపుత్రుల పోరాట చరిత్రలో కేసీఆర్ పేరు చెరగని మూడు అక్షరాలని, స్వరాష్ట్రంలో సుపరిపాలన అందించి ప్రగతికి సంతకం చేసిన నాయకుడని హరీశ్ రావు అభివర్ణించారు. భవిష్యత్ తరాల్లోనూ ఉద్యమ స్ఫూర్తిని రగిలించే పాఠంగా కేసీఆర్ నిలుస్తారని అన్నారు.