కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది: కల్వకుంట్ల కవిత

  • ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది
  • ఉద్యమకారులతో పెట్టుకొని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదు.. ఇప్పుడు మీరు బాగుపడరు
  • మహిళలను ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేయాలని ఏ పోలీస్ మ్యానువల్​లో ఉంది?
  • ముఖ్యమంత్రి, మహిళ మంత్రులు, మంత్రి వర్గం, డీజీపీ సమాధానం చెప్పాలి
  • ఉద్యమకారులపై లాఠీలు ఝుళిపిస్తే ఏ ఒక్క పార్టీ ఎందుకు మాట్లాడటం లేదు?
  • కాంగ్రెస్ చేస్తున్న దాష్టీకానికి కచ్చితంగా మూల్యం తప్పదు
  • తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ వెలుతురు జూలై 02:

ఉద్యమకారుల నెత్తురు చిందేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఉద్యమకారులతో పెట్టుకుని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదు.. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా బాగుపడదని తేల్చిచెప్పారు. బోడుప్పల్ లో భూ పోరాటం చేసి అరెస్ట్ అయిన కవిత గురువారం సాయంత్రం బొల్లారం పోలీస్ స్టేషన్ నుంచి విడుదయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాష్టీకానికి ఆ పార్టీ కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు. ఉద్యమకారులకు మద్దతుగా పోరాటం చేసేందుకు వెళ్లిన నన్ను, మా పార్టీ మహిళలను ఈడ్చుకుంటూ అమానుషంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లాలని ఏ పోలీస్ మ్యానువల్ లో ఉందో సీఎం, మహిళా మంత్రులు, మంత్రివర్గం, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు.

 కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదు 

ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలను కాంగ్రెస్ సర్కార్ ఎందుకు నెరవేర్చటం లేదని కవిత ప్రశ్నించారు. మీరిచ్చిన హామీలనే అమలు చేయాలని మేము అడుగుతున్నామన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం, పెన్షన్, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చి 30 నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాటను అమలు చేసే ధైర్యం లేనప్పుడు ఎందుకు మాటిచ్చారని ప్రశ్నించారు. మీరిచ్చిన హామీలను అడిగితే పోలీసులతో కొట్టిస్తారా అంటూ మండిపడ్డారు. ఉద్యమకారుల నెత్తురు చూసిన ఈ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని కవిత చెప్పారు. గతంలో ఉద్యమకారులతో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుపడలేదని, ఇప్పుడు మీరు బాగుపడరని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న దాష్టీకాలకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.

ఏ పోలీస్ మ్యానువల్​లో ఉంది? 

తనను పోలీసులు అరెస్ట్ చేసిన విధానం పై కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను ఈడ్చుకుంటూ వెళ్లాలని ఏ మ్యానువల్ లో ఉందో ముఖ్యమంత్రి, మహిళా మంత్రులు, డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్తే పోలీసులకు అవార్డులు ఇస్తారా? అని ప్రశ్నించారు. తాము మాట్లాడతామని చెప్పిన కూడా పోలీసులు వినలేదని కవిత అన్నారు. ప్రజాస్వామ్యంలో మాట, ముచ్చట, మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. తమను అరెస్ట్ చేసిన విధానానికి సంబంధించి వీడియోలు ప్రభుత్వ పెద్దలు చూడాలన్నారు.

 ఏ పార్టీ కూడా ఎందుకు మాట్లాడటం లేదు? 

ఉద్యమకారులను రక్తాలు వచ్చేలా కొడితే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని కవిత ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు మద్దతిస్తే వాళ్లంతా ఉద్యమకారులు కాకుండా పోతారా అని అడిగారు. ఉద్యమకారులను అన్ని పార్టీలు మోసం చేశాయని చెప్పారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తామన్న దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. వారి తరుఫున మొదటి పోరాటం మొదలుపెట్టామని…హామీలు అమలు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని అన్నారు.

భూపోరాటం ఉద్రిక్తత

అంతకు ముందు తెలంగాణ రక్షణ సేన పార్టీ బోడుప్పల్ లో చేపట్టిన భూ పోరాటం తీవ్ర ఉద్రిక్తతతకు దారి తీసింది. టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఆమెను అరెస్ట్ చేసే సమయంలో ఓవరాక్షన్ చేశారు. బండ రాళ్లపై పడేసి, కారు డోరుకేసి గుద్దుతూ బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్ట్ లపై లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. కవిత ను బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించి నిర్భందించారు. దీంతో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ చేరుకొని కవిత ను వదిలిపెట్టాలంటూ ధర్నాకు దిగారు. పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు భూ పోరాటాన్ని అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ వేలాది మంది బోడుప్పల్ చేరుకున్నారు. భూ పోరాటం చేసిన ప్రాంతానికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్టించి, బోనం ఎత్తి ప్రత్యేక పూజాలు చేశారు.

బండ రాళ్లపై పడేసి, కారు డోరుకేసి గుద్ది

కవితను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు బలవంతంగా చేతులపై అమాంతం ఎత్తుకెళ్తున్నప్పుడు జరిగిన తోపులాటలో కవితని కింద పడేశారు. అక్కడున్న పెద్ద పెద్ద బండ రాళ్లపై కవితను కుదేసినట్టుగా కింద పడేశారు. తోపులాట తాకిడికి పోలీసులు కూడా ఆమె మీద పడ్డారు. మళ్ళీ అక్కడి నుంచి పోలీసు కారు వరకు చేతులపై ఎత్తుకెళ్లిన పోలీసులు తోపులాటలో ఆమెకు రక్షణగా లేకపోవడంతో కారు డోర్ కు ఢీ కొట్టారు. దీంతో కవిత తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతిఘటించారు. వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బలవంతంగా వారిని తోసేస్తూ కవిత ను కారు ఎక్కించారు. టీఆర్ఎస్ నాయకులపై, ఉద్యమకారులపై లాఠీ ఛార్జ్ చేసి రక్తాలు వచ్చేలా కొట్టారు. జర్నలిస్ట్ లను కూడా వదలకుండా వారిపై చేయి చేసుకున్నారు. వందలాది మంది ఉద్యమకారులను, టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు.

పోలీస్ స్టేషన్ ముందు ధర్నా

కవిత ను అరెస్ట్ చేసి బొల్లారం స్టేషన్ కు తరలించారు. కొన్ని గంటల పాటు ఆమెను స్టేషన్ లో నిర్భందించారు. కవిత ను విడుదల చేయాలని బొల్లారం పోలీస్ స్టేషన్ ఎదుట తెలంగాణ రక్షణ సేన నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళన చేశారు. ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తే ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ లో కవితను నిర్బంధించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను వెంటనే విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఉద్యమకారుల రక్షణ కాలనీగా నామకరణం

బోడుప్పల్ లోని హెచ్ఎండీఏ కు చెందిన భూమికి తెలంగాణ ఉద్యమకారుల రక్షణ కాలనీగా కవిత నామకరణం చేశారు. ఆ ప్రాంతంలో బొడ్రాయి ప్రతిష్టించి పూజాలు నిర్వహించారు. ఇక నుంచి ఈ ప్రాంతంలోని భూములు ఉద్యమకారులవే అని స్పష్టం చేశారు. పోలీసులు అడుగడుగునా అడ్డుకున్న సరే వాళ్ల కళ్లుగప్పి కవిత భూ పోరాటం ప్రాంతానికి చేరుకున్నారు. నిన్న రాత్రి నుంచే ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. జంజారాహిల్స్ లో కవిత ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులను మొహరించారు. అయితే పోలీసులను తప్పించుకొని కవిత భూ పోరాటం ప్రాంతానికి చేరుకున్నారు. వేలాది మంది ఉద్యమకారులు, పార్టీ నాయకులతో కలిసి భూ పోరాటం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్ల కార్డులు ప్రదర్శించారు. ఉద్యమకారులకు వెంటనే 250 గజాల స్థలాన్నిఇవ్వాలని డిమాండ్ చేశారు.

అడుగడుగునా అడ్డుకున్నా.. వెనక్కి తగ్గని ఉద్యమకారులు

తెలంగాణ రక్షణ సేన తలపెట్టిన భూ పోరాటాన్ని భగ్నం చేసేందుకు పోలీసులు అడుగడునా ప్రయత్నించారు. నిన్న రాత్రి నుంచే అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణులను, ఉద్యమకారులకు అదుపులోకి తీసుకున్నారు. బోడుప్పల్ కు రాకుండా ఎక్కడికక్కడ నిర్భందించారు. అయినా సరే ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులు కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఉదయం 9 గంటల వరకే వేలాదిగా ఉద్యమకారులు బోడుప్పల్ కు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్యమకారులకు ఇస్తామన్న హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే కార్యక్రమాన్ని భగ్నం చేసే ప్రయత్నంలో పోలీసులు ఓవరాక్షన్ చేశారు. భూపోరాటం చేసే స్థలంలో వేసిన టెంట్లను తొలగించారు. ఉద్యమకారుల పట్ల అమానుషంగా వ్యవహరించారు. వారిని దుర్భాషలాడుతూ లాఠీలతో కొట్టారు. వందలాది మందిని బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత, తోపులాట జరిగింది. పోలీసుల తీరుపై ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. ఎన్ని నిర్బంధాలు పెట్టిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఉద్యమిస్తామని కవిత స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.