జనావాసాల్లోనే క్యూర్‌ ఇందిరమ్మ ఇళ్లు

  • దూర ప్రాంతాల్లో ఇళ్లు వద్దన్న సీఎం
  • నిరుపయోగ భూముల గుర్తింపునకు ఆదేశం
  • పనికి దగ్గరగా ఇళ్ల నిర్మాణంపై దృష్టి
  • తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు
  • ఒక్కో ఫ్లాట్‌కు రూ.5 లక్షల సబ్సిడీ
  • ల్యాండ్‌ కాస్ట్‌ను భరించనున్న ప్రభుత్వం

హైదరాబాద్, జూన్ 23 (వెలుతురు):

జనావాసాలకు దూరంగా కాకుండా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉండే ప్రాంతాల్లోనే క్యూర్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన నిరుపయోగ స్థలాలను గుర్తించి, తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.

శుక్రవారం క్యూర్‌ పరిధిలో చేపట్టనున్న ఇందిరమ్మ గృహాల నిర్మాణంపై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పోలీస్‌, రెవెన్యూ, రవాణా శాఖలకు చెందిన వినియోగంలో లేని భూములను గుర్తించి, అవసరమైతే ఆయా శాఖలకు ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించి గృహ నిర్మాణానికి వినియోగించాలని ఆదేశించారు.

జనావాసాలకు దూరంగా ఇళ్లు నిర్మిస్తే లబ్ధిదారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమవుతారని, ఫలితంగా ఆ ఇళ్లు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. అందుకే పని ప్రదేశాలకు చేరువలో, ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇందిరమ్మ గృహాలను నిర్మించాలని స్పష్టం చేశారు. దీనివల్ల నిరుపేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నారు.

క్యూర్‌ పరిధిలో నిర్మించే ఒక్కో ఫ్లాట్‌ 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 400 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియాతో ఉండనుంది. ఒక్కో ఫ్లాట్‌ నిర్మాణ వ్యయం సుమారు రూ.11 లక్షలు కాగా, అందులో రూ.5 లక్షల సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది. మిగిలిన రూ.6 లక్షలను లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. భూమి వ్యయాన్ని మాత్రం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.

తొలి విడతలో రాజేంద్రనగర్‌, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్‌గిరి, నాంపల్లి, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, కార్వాన్‌, బహదూర్‌పురా, అంబర్‌పేట్‌, కూకట్‌పల్లి, మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, సనత్‌నగర్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, మలక్‌పేట్‌ నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం నిరుపయోగ ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.