- పుట్టినరోజు నాడే యువ ఇంజినీర్ దుర్మరణం
- ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన కారు
- ఆసుపత్రి బెడ్‌పైనే బర్త్‌డే వేడుకలు
- వేడుకలైన కాసేపటికే విషమించిన ఆరోగ్యం
- స్వగ్రామంలో సోకసంద్రం
అమెరికా, వెలుతురు (జూన్ 24):
ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకున్న ఆ యువకుడిని విధి వెక్కిరించింది. కళ్లముందే ఉన్నత భవిష్యత్తు కనిపిస్తున్న తరుణంలో అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. పుట్టినరోజు నాడే ఆ యువకుడు కన్నుమూయడంతో స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి (24) మూడేళ్ల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లారు. చదువు పూర్తయిన తర్వాత ఇటీవలే ఆయన అక్కడ ఒక ఉద్యోగంలో కూడా చేరారు. మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో నివాసముంటున్న నిత్యానంద రెడ్డి ఈ నెల 18న తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఒక కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో గమనించిన స్నేహితులు తక్షణమే డెట్రాయిట్‌లోని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఆసుపత్రి బెడ్‌పైనే వేడుకలు.. కాసేపటికే మహామౌనం
జులై 23న నిత్యానంద రెడ్డి పుట్టినరోజు కావడంతో, ఆయన త్వరగా కోలుకుంటాడనే ఆశతో స్నేహితులు ఆసుపత్రి బెడ్‌పైనే బర్త్‌డే వేడుకలు నిర్వహించారు. అయితే వేడుకలు పూర్తయిన కాసేపటికే నిత్యానంద రెడ్డి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కన్నీరుమున్నీరవుతున్న స్వగ్రామం
తన పుట్టినరోజు నాడే కొడుకు నూరేళ్ల ఆయుష్షు తీరిపోయిందనే వార్త విన్న నర్సాపూర్ గ్రామస్తులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. కంటికి రెప్పలా పెంచుకున్న కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిత్యానంద రెడ్డి పార్థివదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు చొరవ చూపి తగిన సహాయం అందించాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
