లండన్‌లో ఘనంగా ‘టాక్ బోనాల జాతర’ వేడుకలు

  • ప్రత్యేక ఆకర్షణగా లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు
  • ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, పోతురాజు విన్యాసాలు

లండన్, వెలుతురు (జూన్ 28):

లండన్: తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ వేడుకలకు యూకే నలుమూలల నుండి సుమారు 2500కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వేడుకలకు, వ్యాఖ్యాతగా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్‌పర్సన్ గణేష్ కుప్పాల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హై కమీషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ లు పాల్గొన్నారు.

మహిళలు బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోతరాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.  స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్ద పూజలు, తొట్టెల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసికొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని ముఖ్య అతిథిలు అన్నారు. లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.  బోనాల ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి మాట్లాడుతూ నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడి తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం అయ్యేలా కృషి జరుగుతుందంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటేనని, కాబట్టి అన్ని సందర్భాల్లో రాష్ట్ర ఏర్పాటు కొరకై ముందుండి నాయకత్వం వహించిన ఉద్యమశిఖరం రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని మనం అన్ని సందర్భాల్లో గుర్తు చేసుకోవాలని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం చేసిన కార్యవర్గాన్ని అభినందించారు. మన రాష్ట్ర పండగని రాజకీయాలకు అతీతంగా మరింత వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ ఆషాఢంలో జరిగే బోనాలు విశిష్టతను వివరించారు.తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఆషాఢ బోనాల వేడుకలని, పండుగను ప్రజలంతా కలిసిమెలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ చల్లగా జీవించాలని, ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  టాక్ సంస్థ కార్యక్రమాల గురించి వివరించి, అందరు ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. టాక్ సంస్థని అన్ని సందర్భాల్లో సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలంకు కృతజ్ఞతలు తెలిపారు.

టాక్ ఉపాద్యక్షురాలు శుష్మణ రెడ్డి మాట్లాడుతూ విశిష్టమైన తెలంగాణ సంస్కృతికి బోనాలు వేడుకలు ప్రతీకలుగా నిలుస్తాయని, టాక్ సంస్థ ద్వారా జరుపుతున్న బోనాల వేడుకలకు విచ్చేసిన అతిథులకు, స్థానిక ప్రవాసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆడబిడ్డలందరు బోనాలతో మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరు నూతన ఉత్సాహాన్ని నింపిందని, ‘ఇలాంటి పండుగ వేళ పిల్లలకు మన సాంప్రదాయాన్ని ప్రత్యక్షంగా చూపించడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. అనంతరం టాక్ చేస్తున్న కార్యక్రమాల గురించి అలాగే భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి సభకు వివరించారు.

ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు మాట్లాడుతూ తెలంగాణలో బోనాల పండగకు ఉన్న ప్రత్యేకత ఎంతో గొప్పదని, గ్రామ దేవతలను ఆరాధిస్తూ జరిపే ఈ పండుగకు యూకే నలుమూలల నుండి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. టాక్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం సహకారం, సూచనలు, స్పూర్తి వల్లే జాతరను ఇంత ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు.

టాక్ ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. లండన్ లో తెలంగాణ రాష్ట్ర పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం గర్వాంగా ఉందని, ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పడ్డాక బోనాలు – బతుకమ్మ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు.

టాక్ అడ్వైసరి చైర్మన్ మట్టా రెడ్డి మాటాడుతూ టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయని, బోనాల జాతర వేడుకల విజయానికి కృషి చేసిన సహకరించిన స్థానిక ప్రభుత్వ యంత్రంగానికి, టాక్ కార్యవర్గానికి, స్థానికి సంస్థలకు, అతిధులకు, అలాగే హాజరై ప్రోత్సహించిన ఎన్నారై మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నఅతిథుల్ని ఇతర సంస్థల్ని ప్రతినిధులని, స్పాన్సర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ లను, సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ కార్యవర్గ సభ్యులు జ్ఞాపికలతో సత్కరించి, బహుమతులందజేశారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో కార్యక్రమం ముగించారు.

ఈ కార్యక్రమంలో కంది పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగిళి, సత్య చిలుముల, రవి రేతినేని , రవి ప్రదీప్ పులుసు, మల్లా రెడ్డి, గణేష్ పస్తం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్లా, స్నేహ,  విజయ లక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతి, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరిగౌడ్ నవపేట్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్,  లతా కూర్మాచలం, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయి రావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్, నవ్య, ఉమా తదితరులు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.