ఆటా 19వ మహాసభల్లో ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు పూజారికు ఘన సత్కారం

అమెరికా, హైదరాబాద్, వెలుతురు ఆగస్టు 02:

అమెరికాలోని బాల్టిమోర్ వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతున్న అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభల్లో ప్రముఖ న్యాయవాది నాగేశ్వరరావు పూజారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకుల నుంచి అరుదైన గౌరవం దక్కింది. న్యాయ, సామాజిక రంగాల్లో ఆయన అందిస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా ‘ఆట’ ప్రతినిధులు ఆయనను వేదికపై ఘనంగా సత్కరించారు.

అమెరికా నలుమూలల నుంచి విచ్చేసిన పలువురు ప్రవాస భారతీయులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల సమక్షంలో ఈ సత్కార కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆయనను  నిర్వాహకులు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా నాగేశ్వరరావు పూజారి మాట్లాడుతూ ఖండాంతరాల్లో ఉన్నా మాతృభూమిపై ప్రేమతో తెలుగువారిని ఏకం చేస్తూ, మన భాషా సంస్కృతులను దశదిశలా చాటుతున్న ‘ఆటా’ చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తనను గుర్తించి ఇంతటి గౌరవం అందించిన అమెరికన్ తెలుగు సంఘం కార్యవర్గానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో ఉంటున్న తెలుగు వారందరికీ అవసరమైన న్యాయ సలహాలు ఇవ్వడంతో పాటు, ఇమిగ్రేషన్, కుటుంబ సమస్యలకు సంబంధించి తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నానని నాగేశ్వరరావు పూజారి తెలిపారు.

ప్రవాస భారతీయులలో అతిపెద్ద తెలుగు వేదికల్లో ఒకటైన ఆటా, తన సామాజిక, విద్యా, సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా రెండు రాష్ట్రాల అభివృద్ధికి కూడా దోహదపడుతోందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.