ప్రజా ప్రతిపక్షం లేని … అణచివేతే అభివృద్ధా?

ప్రజా ప్రతిపక్షం లేని … అణచివేతే అభివృద్ధా?

మన దేశంలో ప్రజాస్వామ్యం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో గెలిచిన పార్టీ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం సహజమే, కానీ ప్రతిపక్షాన్ని నిర్మూలించడం, ప్రశ్నించే స్వరాలను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. పశ్చిమ బెంగాల్ నుండి తెలుగు రాష్ట్రాల వరకు ఈ ధోరణి తీవ్రంగా కనిపిస్తోంది. అధికారం మారినప్పుడల్లా జెండాలు మారుతున్నాయే తప్ప ప్రజల సమస్యలు మారడం లేదు. కావునా ఈ దేశానికి నేడు అత్యవసరమైనది బలమైన, నిజమైన ప్రజా ప్రతిపక్షం.

ప్రజాస్వామ్యంలో ఓటు పౌరుని అత్యున్నత అధికారం. కానీ ఆ అధికారం ఇప్పుడు కొనుగోలు వస్తువుగా మారింది. అధికార పక్షాన్ని నిలదీసే వర్గాలను లక్ష్యంగా చేసుకుని వారి ఓటును ‘సర్’ (SIR) పేరుతో జాబితా నుండి తొలగిస్తున్నారు. బీహార్‌లో 2025లో జరిగిన SIR ప్రక్రియలో దాదాపు 47 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి, ముస్లిం మెజారిటీ ఉన్న సీమాంచల్ ప్రాంతంలో ఈ తొలగింపుల శాతం రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉండటంతో బీజేపీకి ఓటు వేయని వర్గాలనే లక్ష్యంగా చేసుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు లక్షా పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ అంచనా వేసింది, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక ఇది. ఈ ధనం కార్పొరేట్ సంస్థల నుండి, భూస్వాముల నుండి, ఖనిజ వనరుల లాభదారుల నుండి వస్తుంది, ఆ తర్వాత అదే వర్గాల పక్షాన విధానాలుగా రూపొందుతుంది. ఇది యాదృచ్చికం కాదు, ఒక వ్యవస్థీకృత చక్రం. ప్రజలను నిరుపేదలుగా ఉంచి డబ్బు, మద్యం, కులపు లెక్కలతో ఓట్లు కొనుగోలు చేసి, తర్వాత అదే పాలకులు “ప్రజలే డబ్బులకు అమ్ముడుపోతున్నారు” అని నిందించడం కపటత్వంలో పరాకాష్ట. ఆర్థిక స్వాతంత్య్రం లేని పౌరుడు రాజకీయంగా స్వతంత్రుడు కాలేడు, కావున ధన రాజకీయాలను ఎదుర్కోవడం సామాజిక న్యాయపు ప్రశ్న కూడా.

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ దాదాపు పదిహేనేళ్ళు పాలించి, ఫిరాయింపులు, దర్యాప్తు సంస్థల ఒత్తిళ్ళు, రాజకీయ హింస ద్వారా ప్రతిపక్షాన్ని బలహీనపరిచింది. కానీ 2022లో ఉపాధ్యాయ నియామక అవినీతి, 2024లో ఆర్.జి.కర్ వైద్య కళాశాలలో డాక్టర్ హత్య దేశవ్యాప్త నిరసనలకు దారితీశాయి, బయటి ప్రతిపక్షాన్ని మింగిన పార్టీ లోపలి కుళ్ళుతో విలవిల్లాడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే చిత్రం బహిరంగంగా కనిపిస్తుంది: ఏపీలో 2019లో వైసీపీ, 2024లో టీడీపీ అధికారంలోకి రాగానే ప్రత్యర్థి నేతలపై వందలాది కేసులు నమోదవుతున్నాయి; తెలంగాణలోనూ ప్రతి అధికార మార్పిడి తర్వాత నిన్నటి పాలకులు నేటి నిందితులవుతున్నారు. ఏళ్ళ కేడర్‌ను పక్కనపెట్టి అవకాశవాద వలస నేతలకు టికెట్లు ఇవ్వడం పార్టీల పునాదులనే బలహీనపరుస్తోంది. ఈ రాజకీయ పగతీర్చుకోవడాల మధ్య నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, ప్రాథమిక సేవలు, కుల అసమానతలు అనే అసలు సమస్యలు చర్చకు రావడం లేదు.

మన దేశంలో “హింస” అంటే తుపాకీ, కత్తి మాత్రమే అనే నిర్వచనం స్థిరపడింది గానీ ఇది అసంపూర్ణం. NCRB లెక్కల ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 11 వేలకు పైగా రైతులు, వ్యవసాయ కార్మికులు స్వీయ మరణాలు చేసుకున్నారు; ఐఐటి, ఎనఐటి, సెంట్రల్ యూనివర్శిటీల విద్యార్థుల స్వీయ మరణాలు ప్రతి ఏటా వందల్లో నమోదవుతున్నాయి. కుల వివక్ష, మహిళలపై దాడులు, వరకట్న హత్యలు, కార్మిక దోపిడీతో జరిగే మరణాలు కూడా ఈ విస్తృత నిర్వచన పరిధిలోకి వస్తాయి, ఇవి వ్యవస్థాగత నిర్లక్ష్యం, అసమానత ఫలితాలే తప్ప వ్యక్తిగత దురదృష్టాలు కావు. డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు, “రాజకీయ ప్రజాస్వామ్యం అర్థవంతం కావాలంటే సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా ఉండాలి.” ఓటు హక్కు ఉన్నా చదువుకోవడానికి డబ్బు లేక, జబ్బుపడినప్పుడు వైద్యం అందక, కులం వల్ల అవమానాలు పడుతూ జీవించే ప్రజలకు ఆ ప్రజాస్వామ్యం ఎంత వాస్తవం?

రాష్ట్ర హింస, బూటకపు ఎదురుకాల్పులు, పోలీసు నిర్బంధంలో మరణాలు కూడా చర్చకు రావాల్సినవే; జాతీయ మానవ హక్కుల కమిషన్ లెక్కల ప్రకారం ఈ మరణాల సంఖ్య తగ్గడం లేదు. పోలీసు వ్యవస్థ ప్రజలకు సేవ చేయాలి తప్ప ఏ పార్టీకో కాదు, కానీ అధికారం మారిన ప్రతిసారీ ఉన్నతాధికారులపై బదిలీలు, సర్వీసు నిలిపివేతలు పెరుగుతున్నాయి. ప్రకాష్ సింగ్ దాఖలు చేసిన అర్జీపై అత్యున్నత న్యాయస్థానం పోలీసు సంస్కరణలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, దశాబ్దాలు గడిచినా చాలా రాష్ట్రాలు వాటిని అమలు చేయలేదు, రాజకీయ అధికారం పోలీసు వ్యవస్థను వదలదు కనుక.

ప్రజా ప్రతిపక్షం అంటే కేవలం ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ కాదు, అది విస్తృతమైన భావన. ఒక స్తంభాన్ని అణచివేసినా అది మరో రూపంలో మళ్ళీ పుడుతుంది. ప్రశ్నించే మీడియా ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం, కానీ దాన్నే మొదట లక్ష్యంగా చేసుకుంటున్నారు. భారత్ 2026 RSF మీడియా స్వేచ్ఛ సూచికలో 180 దేశాల్లో 157వ స్థానానికి పడిపోయింది, గత ఏడాది 151వ స్థానం నుండి దిగజారింది. ప్రశ్నించే జర్నలిస్టులపై యుఏపిఏ, రాజద్రోహం కేసులు పెరుగుతున్నాయి. ఈ కుట్రపూరిత నిర్బంధం ఒక గొంతును మూయగలిగినా, ప్రజాస్వామ్య చైతన్యం వేరే రూపాల్లో ప్రతిఘటనగా మారుతూనే ఉంది. రోహిత్ వేముల మరణం విద్యార్థి ప్రజాస్వామ్య స్పృహను కదిలిస్తే, 2020-21లో ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన రైతు ఉద్యమం మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చేసింది. అదే పరంపరలో, రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులు ఆచరణలో అమలవుతున్నాయా అని నిరంతరం ప్రశ్నించే దళిత బహుజన, మహిళా సంఘాలు ప్రజాస్వామ్యపు నిజమైన కాపలాదారులుగా నిలుస్తున్నాయి. వామపక్ష, విప్లవ ఉద్యమాలు కూడా ఇదే పరంపరలో భూ పంపిణి, శ్రామిక దోపిడీ, దళిత బహుజన ఆదివాసీ హక్కులు, కుల అణచివేత అంశాలను ముందుకు తెచ్చిన చారిత్రక పాత్రను విస్మరించలేం. వారి పద్ధతులపై భిన్నాభిప్రాయాలుండొచ్చు గానీ అసమానతలను ప్రశ్నించే గొంతుకల అవసరాన్ని నిరాకరించలేం. పార్లమెంటరీ ప్రతిపక్షం బలహీనపడినా, ప్రభుత్వేతర ప్రజా శక్తులు, అంటే మీడియా, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంస్థలు, బలంగా ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం పూర్తి నిరంకుశత్వంగా మారదు. అసలు ప్రశ్న ఉద్యమం ఏ భావజాలానికి చెందిందన్నది కాదు, అది అసమానతలను ప్రశ్నిస్తుందా, హక్కులను విస్తరిస్తుందా, జవాబుదారీతనాన్ని బలోపేతం చేస్తుందా అన్నదే. ప్రశ్నించే స్వరాలు లేకపోతే బలమైన ప్రభుత్వం కూడా క్రమంగా నిరంకుశత్వం వైపు జారిపోవచ్చు.

ఈ ప్రశ్నించే స్వరాల అవసరం కేవలం రాజకీయ వ్యూహం కాదు, సమాజపు తాత్విక పునాదికి సంబంధించిన ప్రశ్న. పొట్టకూటి కోసం రోజుకు 12-14 గంటలు వ్యవసాయంలో, గిగ్ వర్కర్లుగా, చేనేతలో, కల్లుగీతలో, మాల మాదిగ తదితర శ్రామిక వృత్తుల్లో రెక్కలు ముక్కలు చేసుకునే బహుజన శ్రామికుడికి బ్రతకడమే ఒక పోరాటంగా మారినప్పుడు అతనికి “స్వేచ్ఛ” ఎక్కడుంది? సమాజంలో ఒక్కరు బానిసత్వ పరిస్థితుల్లో జీవిస్తున్నా ఆ సమాజం పూర్తి స్వేచ్ఛను సాధించినట్టు కాదు, అత్యంత అణగారిన వ్యక్తి స్వేచ్ఛ, గౌరవం, అభివృద్ధి స్థాయే ఆ సమాజ ప్రజాస్వామిక ప్రగతికి నిజమైన కొలమానం. కావున సామాజిక సమతుల్యత అంటే కేవలం రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల ప్రశ్న కాదు, నిర్ణయాత్మక స్థానాల్లో భాగస్వామ్యం, నాణ్యమైన విద్య ఆరోగ్య సేవలు, కులం మతం లింగం ఆధారంగా వివక్ష లేని సమగ్ర వ్యవస్థను నిర్మించే నిరంతర ప్రజాస్వామిక ప్రక్రియ అది.

పాలకుల పట్ల దేవుడిల ఆరాధన కాదు, జవాబుదారీగా నిలబెట్టే పౌర స్పృహ అవసరం, ఓటు హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, మీడియా, పోలీసు వంటివి నిజంగా స్వతంత్రంగా పనిచేసినప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. ఏ పార్టీ అయినా ప్రతిపక్షాన్ని నిర్మూలించే బదులు ప్రజా సమస్యలపై పోటీ చేయాలి, విధానాల పోటీయే నిజమైన ప్రజాస్వామ్యం. చరిత్ర ఒక సత్యాన్ని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తోంది: ప్రశ్నించే స్వరాలను అణచివేసే వ్యవస్థలు తాత్కాలికంగా బలంగా కనిపించినా దీర్ఘకాలంలో లోపల నుండే కూలిపోతాయి, 1975 అత్యవసర పరిస్థితి ఇందిరా గాంధీని అధికారం కోల్పోయేలా చేయడం దీనికి ఉదాహరణ.

ప్రజాస్వామ్యం ఐదేళ్ళకొకసారి జరిగే ఎన్నికలు మాత్రమే కాదు, అది ప్రతిరోజూ జీవించే విలువ, జర్నలిస్టు ప్రశ్నలో, విద్యార్థి నిరసనలో, రైతు పోరాటంలో, దళిత బీసీ కార్యకర్త గొంతులో అది శ్వాసిస్తుంది. పౌర సంస్థలు, రాజ్యాంగ సంస్థలు, వివిధ రాజకీయ పక్షాలు స్వతంత్రంగా, బలంగా పనిచేసినప్పుడే దేశంలో ప్రజాస్వామ్యం బలంగా పనిచేస్తుంది. ప్రజల గౌరవాన్ని, స్వేచ్ఛను, సమానత్వాన్ని కాపాడే ఈ శక్తులే నిజమైన ప్రజా ప్రతిపక్షం. అవి బలంగా నిలబడినప్పుడే సమాజంలో సమతుల్యత సాధ్యమవుతుంది, అదే ప్రగతికి నిజమైన బాట.

పాపని నాగరాజు
(సత్యశోధక మహాసభ)

Leave A Reply

Your email address will not be published.