నిజామాబాద్ జీజీహెచ్‌కి సరికొత్త రూపం

  • ప్రధాన రిఫరల్ ఆస్పత్రిగా అభివృద్ధికి ప్రణాళికలు
  • సూపర్ స్పెషాలిటీ సేవలు త్వరలోనే ప్రారంభం
  • మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటన
  • అత్యాధునిక ఎంఆర్‌ఐ పరికరం అందుబాటులోకి
  • సచివాలయంలో జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం
  • జిల్లా వైద్య రంగంపై సమగ్ర సమీక్ష
  • మెడికల్ కాలేజీ, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీల పనితీరుపై ఆరా

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 03:

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)ను ప్రధాన రిఫరల్ సెంటర్‌గా తీర్చిదిద్దుతున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రి ద్వారా కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ వంటి కీలకమైన సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. పేద ప్రజలకు మెరుగైన నిర్ధారణ పరీక్షల కోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఎంఆర్‌ఐ యంత్రాన్ని త్వరలోనే కొనుగోలు చేసి సేవలు ప్రారంభిస్తామని తెలిపారు.

సోమవారం డాక్టర్ బీఆర్‌‌ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, జీజీహెచ్, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీలు), ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సబ్ సెంటర్లలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత, జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాప్రతినిధులు తమ ప్రాంతాల్లోని ఆస్పత్రుల పరిస్థితిపై అందించిన సూచనలను నోట్ చేసుకుని, తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ఆస్పత్రులపై సామాన్య ప్రజల్లో విశ్వాసం గణనీయంగా పెరిగిందని సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్, గాంధీ, ఉస్మానియా వంటి ఆస్పత్రులతో పాటు నిజామాబాద్ జీజీహెచ్‌లో బెడ్ల కోసం ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రజల నుంచి ఫోన్లు వస్తున్నాయని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులను మరింతగా బలోపేతం చేసి అన్ని రకాల చికిత్సలు అందిస్తే, హైదరాబాద్‌లోని ప్రధాన ఆస్పత్రులపై రోగుల ఒత్తిడి చాలావరకు తగ్గుతుందని స్పష్టం చేశారు.

సమీక్షా సమావేశంలో స్థానిక నియోజకవర్గాల అవసరాలను ప్రజాప్రతినిధులు మంత్రికి వివరించారు. అంకాపూర్‌లో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ఏర్పాటు చేయాలని కోరగా, దానికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే పీహెచ్‌సీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే నందిపేట్ పీహెచ్‌సీని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయడం, ఇందల్వాయిలో అత్యవసర చికిత్సల కోసం ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం వంటి ప్రతిపాదనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.జిల్లా పరిధిలో వైద్య సేవలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే నియామకాలు చేపట్టిందని మంత్రి వెల్లడించారు. ఇటీవల ఏరియా హాస్పిటళ్లు, సీహెచ్‌సీలలో 18 మంది గైనకాలజిస్టులు, 22 మంది అనస్థీషియా స్పెషలిస్టులు, 22 మంది పిడియాట్రీషియన్లతో పాటు సుమారు 330 మంది నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్‌లు ఇచ్చామన్నారు. ఈ నెలాఖరు నాటికి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, రేడియాలజీ తదితర విభాగాల్లోనూ ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి, జిల్లాలో ఎలాంటి సిబ్బంది కొరత లేకుండా చూస్తామని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో మానవ వనరులు (హెచ్‌ఆర్), అత్యాధునిక వైద్య పరికరాలు, మందుల కొరత లేకుండా చూడటం, ఉచిత డయాగ్నస్టిక్ సేవలను పటిష్టం చేయడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని దామోదర్ రాజనర్సింహ చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ప్రజాప్రతినిధులు కూడా స్థానిక ఆస్పత్రుల పర్యవేక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పి. సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, రేకులపల్లి భూపతి రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. అధికారుల తరఫున ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. వాణి, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్, నిజామాబాద్ డీఎంహెచ్‌వో, జీజీహెచ్ సూపరింటెండెంట్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తదితరులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.