తుమ్మిడిహెట్టి ఎత్తు 150 మీటర్లకు పెంచండి

  • తుమ్మిడిహెట్టి ఎత్తు 150 మీటర్లకు పెంచండి
  • కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో రేవంత్ రెడ్డి భేటీ
  • మహారాష్ట్రతో చర్చల్లో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి
  • కేంద్రాన్ని కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
  • 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణానికి అంగీకారం తీసుకురావాలని అభ్యర్థన
  • గ్రావిటీ ద్వారా నీటి సరఫరా సాధ్యమవుతుందని సీఎం వివరణ
  • కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్‌తోనూ ప్రత్యేకంగా చర్చలు

ఢిల్లీ, వెలుతురు ఆగస్టు 5:

దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, రహదారుల నిర్మాణానికి అవసరమైన కేంద్ర అనుమతులపై కేంద్ర మంత్రులతో చర్చించారు.

కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో జరిగిన సమావేశంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు ప్రధాన అంశంగా నిలిచింది. ఈ సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు ఎంపీలు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టు ఎత్తును 150 మీటర్లకు పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీఎం కోరారు.

గతంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 148 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు మహారాష్ట్ర అంగీకరించిందని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తు చేశారు. ప్రస్తుతం మరో రెండు మీటర్లు పెంచి 150 మీటర్ల ఎత్తుతో నిర్మించినా ముంపు విస్తీర్ణం వెయ్యి హెక్టార్లలోపే ఉంటుందని వివరించారు. ఈ మేరకు మహారాష్ట్రతో చర్చించి అంగీకారం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు 150 మీటర్ల ఎత్తుతో నిర్మితమైతే ఎత్తిపోతల పథకాలపై భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని సీఎం తెలిపారు. గ్రావిటీ ద్వారానే నీటిని సరఫరా చేసే అవకాశం ఉండటంతో ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని, విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా ఆదా అవుతుందని వివరించారు. ఈ అంశాన్ని కేంద్రం సానుకూలంగా పరిశీలించి మహారాష్ట్రతో సమన్వయం చేయాలని కోరారు.

అనంతరం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో కూడా సీఎం సమావేశమయ్యారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పనులకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులపై చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వం పాల‌మూరు ప్రాజెక్టుపై రూ.36,437 కోట్లు, డిండి ఎత్తిపోత‌ల‌పై రూ.3,187 కోట్లు, సీత‌మ్మ సాగ‌ర్‌పై రూ.1,835 కోట్లు, గౌర‌వెల్లి ప్రాజెక్టుపై రూ.1,350 కోట్ల నిధుల‌ను ఖర్చు చేశామని, అనుమ‌తులు ఇవ్వ‌క‌పోవ‌డంతో ప‌నులు నిలిచిపోయాయ‌ని, ఫ‌లితంగా ప్రాజెక్టుల వ్య‌యం పెరుగుతోంద‌ని కేంద్ర మంత్రికి వివరించి, సుప్రీంకోర్టు తీర్పు నేప‌థ్యంలో ప్రాజెక్టుల‌కు తక్ష‌ణ‌మే అనుమ‌తులు మంజూరు చేయాల‌ని కోరారు.

ఈ స‌మావేశంలో ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేం న‌రేంద‌ర్ రెడ్డి, మ‌ల్లు ర‌వి, రామ‌స‌హాయం ర‌ఘురాంరెడ్డి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, గ‌డ్డం వంశీకృష్ణ‌, డా. క‌డియం కావ్య‌, ఢిల్లీలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, నీటి పారుద‌ల శాఖ స‌ల‌హాదారు ఆదిత్య‌నాధ్ దాస్ తదితరులుపాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.