నర్సంపేట, వరంగల్, వెలుతురు ఆగష్టు 5:
తెలంగాణనే శ్వాసగా, నీతి, నిజాయితీతో ప్రజాజీవితాన్ని సాగించిన దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయమని టీఎస్‌ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్, ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు.
బుధవారం నల్లబెల్లి మండలంలోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామంలోని వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నను పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం కుటుంబానికే కాకుండా తెలంగాణ ఉద్యమానికి, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొంటూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచి అటు పోరాటంలోనూ, ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారని ఆయన చేసిన త్యాగాలు, ప్రజాసేవ, నిరంతర ప్రజా పోరాటం ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచిన ఆయన సేవలను నర్సంపేట ప్రజలు ఎప్పటికీ మరువరని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి, ప్రజల పక్షాన నిలబడి, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేశారన్నారు. ప్రజాజీవితంలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన వెంట నియోజకవర్గ సీనియర్ నాయకుడు రాజ్ కుమార్ శానబోయిన, బిఆర్ఎస్ ఎన్నారై యూకే నాయకులు గణేష్ పుప్పాల, మధు యాదవ్, తిరుమందాస్ నరేష్ గౌడ్, సాగర్ మోడెం పాల్గొని నివాళులర్పించారు.



