- యూత్ కాంగ్రెస్ ‘నారీ శక్తి అభియాన్’ శిక్షణ కార్యక్రమంలో మంత్రి సీతక్క
- మహిళల సాధికారతకు కాంగ్రెస్ కృషి
- మహిళల ఎదుగుదలకు పార్టీ అండగా ఉంటుందన్న సీతక్క
ఢిల్లీ, వెలుతురు, ఆగష్టు 8:
ఆన్‌లైన్ యుగంలో మహిళలు ఎదుర్కొంటున్న కొత్త సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు వారు అన్ని రంగాల్లో శక్తివంతంగా ఎదగాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహిళలు తమ సామర్థ్యాలను గుర్తించి ఆర్థికంగా, సామాజికంగా స్వావలంబన సాధించాలని సూచించారు.
ఢిల్లీలో శనివారం నిర్వహించిన యూత్ కాంగ్రెస్ ‘నారీ శక్తి అభియాన్’ శిక్షణ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. మారుతున్న సాంకేతిక పరిస్థితులతో పాటు మహిళల ముందుకొస్తున్న కొత్త సవాళ్లను గుర్తించి వాటిని అధిగమించేలా యువతులు తమను తాము తీర్చిదిద్దుకోవాలని అన్నారు.
రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాతినిధ్యం, నాయకత్వ అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తోందని సీతక్క పేర్కొన్నారు. మహిళలు రాజకీయ రంగంలో చురుకైన పాత్ర పోషించినప్పుడే సమాజంలో సమానత్వం మరింత బలపడుతుందని అన్నారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
మహిళా సాధికారతను కేవలం రాజకీయ ప్రాతినిధ్యానికే పరిమితం చేయకుండా ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్రతి మహిళ తన కాళ్లపై తాను నిలబడేలా అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
మహిళలు తమ హక్కులు, అవకాశాలపై అవగాహన పెంచుకుని.. సాంకేతికతను సానుకూలంగా వినియోగించుకోవాలని సీతక్క సూచించారు. ఆన్‌లైన్ ప్రపంచంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంతో పాటు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని వ్యక్తిగత, సామాజిక అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
