చెక్‌ బౌన్స్‌ కేసులో పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఎదురుదెబ్బ

  • రూ.34.23 లక్షల కేసులో దోషిగా తీర్పు
  • హైదరాబాద్‌ మున్సిపల్‌ కోర్టులో విచారణ
  • మూడు సార్లు బౌన్స్‌ అయిన చెక్‌
  • కంపెనీ ఫిర్యాదుతో కోర్టును ఆశ్రయించింది
  • సెక్షన్‌ 138 కింద నేరం నిర్ధారణ
  • కోర్టుకు రాకపోవడంతో ఎన్‌బీడబ్ల్యూ జారీ

హైదరాబాద్‌, వెలుతురు, ఆగష్టు 8:

బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి చెక్‌ బౌన్స్‌ కేసులో కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చింది. రూ.34.23 లక్షల చెక్‌ బౌన్స్‌ వ్యవహారంలో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ హైదరాబాద్‌ మున్సిపల్‌ కోర్టు న్యాయమూర్తి ఖుష్బూ ఉపాధ్యాయ తీర్పు వెలువరించారు. తీర్పు సమయంలో రోహిత్‌రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ కూడా జారీ అయింది.

ఈ కేసు ‘మెసర్స్‌ ఇంటెల్లిడెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థతో రోహిత్‌రెడ్డికి ఉన్న ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినది. సంస్థ వనరులను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించుకుని కంపెనీకి నష్టం కలిగించారనే ఆరోపణలు రావడంతో 2014లో ఆయన సంస్థ నుంచి రాజీనామా చేశారు.

రాజీనామా అనంతరం కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం రూ.34,23,000 చెల్లించాల్సి వచ్చింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు చెందిన చెక్‌ను రోహిత్‌రెడ్డి ఇచ్చారు. అయితే ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో ఆ చెక్‌ నగదుగా మారలేదు. కంపెనీ ఆ చెక్‌ను మూడు పర్యాయాలు బ్యాంకులో జమ చేసినప్పటికీ ప్రతిసారీ బౌన్స్‌ అయింది.

దీంతో సంస్థ న్యాయపరమైన చర్యలకు దిగింది. బకాయి మొత్తాన్ని చెల్లించాలని రోహిత్‌రెడ్డికి లీగల్‌ నోటీసు పంపినప్పటికీ స్పందన లేకపోవడంతో కంపెనీ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 138 కింద ఆయనను దోషిగా నిర్ధారించింది.

అయితే తీర్పు వెలువడే సమయంలో రోహిత్‌రెడ్డి కోర్టులో లేకపోవడంతో న్యాయస్థానం నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచిన తర్వాత కేసులో విధించే శిక్ష వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.