- రాష్ట్రంలో మావోయిస్టు ముప్పు పూర్తిగా తొలగిపోయింది
- రాష్ట్ర భద్రతకు ఎలాంటి ముప్పు లేదు
- కొత్త సవాళ్లపై పోలీసుల దృష్టి
- యువతను వేధిస్తున్న డ్రగ్స్ భూతం
- గ్రేహౌండ్స్ సేవలు ఇక కొత్త దిశలో
- రాజకీయ నేతల భద్రతపై డీజీపీ వివరణ
- త్వరలో కొత్త తెలంగాణ పోలీస్ మాన్యువల్
హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 9:
తెలంగాణలో మావోయిజం ప్రభావం పూర్తిగా అంతమైందని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర భద్రతకు మావోయిస్టుల నుంచి ఎలాంటి ముప్పు లేదని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా మావోయిస్టుల కట్టడిపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన పోలీసు వ్యవస్థ.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన ప్రాధాన్యతలను మార్చుకుంటోందని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణ పోలీసుల ముందున్న అతిపెద్ద సవాలు మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణానేనని డీజీపీ వెల్లడించారు. ముఖ్యంగా యువత, విద్యార్థులపై డ్రగ్స్ ప్రభావం పెరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నామని వివరించారు.
రాజకీయ నేతల భద్రతపై క్లారిటీ
ప్రజాప్రతినిధులకు గన్‌మెన్ల సంఖ్యను తగ్గించడంపై వస్తున్న ఆరోపణలపైనా సీవీ ఆనంద్ స్పందించారు. మావోయిస్టుల ముప్పు తగ్గిన నేపథ్యంలో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాల తరహాలోనే తెలంగాణలోనూ రాజకీయ నేతల భద్రతను సమీక్షించినట్లు తెలిపారు.
భద్రతను పూర్తిగా తొలగించలేదని.. ఆయా వ్యక్తులకు ఉన్న ముప్పు స్థాయిని అంచనా వేసి అవసరమైన మేరకు మాత్రమే సిబ్బందిని తగ్గించినట్లు చెప్పారు. నిఘా విభాగాల నివేదికలు, సెక్యూరిటీ కమిటీ సిఫారసుల ఆధారంగానే భద్రతపై నిర్ణయాలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొన్నారు.
గ్రేహౌండ్స్ నుంచి కొత్త బాధ్యతలు
మావోయిస్టుల ఏరివేతలో కీలకంగా పనిచేసిన గ్రేహౌండ్స్, ఎస్‌ఐబీ వంటి ప్రత్యేక విభాగాలను ఇకపై కొత్త సవాళ్లకు ఉపయోగించనున్నట్లు డీజీపీ తెలిపారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణతో పాటు ఆహార కల్తీ ముఠాలపై చర్యల్లోనూ ఈ బలగాల నైపుణ్యాన్ని వినియోగించనున్నట్లు వెల్లడించారు.
పోలీస్ వ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమూలంగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని సీవీ ఆనంద్ చెప్పారు. త్వరలోనే కొత్త తెలంగాణ పోలీస్ మాన్యువల్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
