హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 9:
హైదరాబాద్ నగరం మరో చారిత్రాత్మక క్రీడా ఘట్టానికి వేదికైంది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘లార్జెస్ట్ తైక్వాండో లెసన్’ ప్రదర్శన దిగ్విజయంగా పూర్తయి, అధికారికంగా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదైంది. ఎంజేఆర్ ఇంటర్నేషనల్ తైక్వాండో అకాడమీ, సుమన్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఇప్పటికే 30 సార్లు గిన్నిస్ రికార్డులు సాధించిన మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
35 నిమిషాల్లో ప్రదర్శితమైన నైపుణ్యాలు
ఈ చారిత్రాత్మక వేడుకలో 9 సంవత్సరాల చిన్నారుల నుండి 70 సంవత్సరాల వృద్ధుల వరకు వివిధ వయస్సులకు చెందిన క్రీడాకారులు, అకాడమీ విద్యార్థులు, కోచ్‌లు, మార్షల్ ఆర్ట్స్ ఔత్సాహికులు ఒక్కటై తమ ప్రతిభను చాటారు. పాల్గొన్న 533 మంది క్రీడాకారులు తైక్వాండో అధికారిక దుస్తులైన ‘డోబోక్’ ధరించి మైదానంలో క్రమశిక్షణతో కొలువుదీరారు. ఈ ప్రదర్శన దాదాపు 35 నిమిషాల పాటు ఏకధాటిగా సాగింది. ఈ సమయంలో క్రీడాకారులందరూ ఉమ్మడిగా 2,000 నుండి 3,000 జంపింగ్ కిక్స్, వివిధ రకాల పంచెస్, బ్లాక్స్ ప్రదర్శించి వీక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
గిన్నిస్ ప్రతినిధి చేతుల మీదుగా పత్రం అందజేత
కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ప్రతినిధి స్వప్నిల్ నిబంధనలకు లోబడి ప్రదర్శన విజయవంతంగా పూర్తయిందని ప్రకటించారు. అనంతరం వేదికపై గ్రాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి, ప్రతినిధులకు గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారిక ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.
తెలుగు నేలకు అంతర్జాతీయ గుర్తింపు
ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ జయంత్ రెడ్డి మాట్లాడుతూ తైక్వాండో క్రీడలోని క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్య ప్రయోజనాలను ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు నేలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ మహత్తర రికార్డు సాధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ గజేందర్ కుమార్, శ్రీకాంత్, కార్యక్రమ సమన్వయకర్త సుమన్, సారంగీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఖాజా ఆఫ్రిది, దైవజ్ఞ శర్మ, ఖలీల్ తదితరులు పాల్గొని విజేతలకు అభినందనలు తెలిపారు.




