ఇంటింటా జాతీయ జెండాను ఎగరేయండి: రాంచందర్‌రావు

  • హర్‌ ఘర్‌ తిరంగాతో దేశభక్తి చాటాలి
  • స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలి
  • ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసిన రాంచందర్‌రావు
  • ఆగస్టు 14న ట్యాంక్‌బండ్‌పై తిరంగా యాత్ర
  • పార్టీలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలి
  • యువత పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలి
  • వికసిత్‌ భారత్‌ సంకల్పంతో యాత్ర

హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 10:

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం తన ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువతను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. ఎలాంటి రాజకీయ భేదాలు లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ఆగస్టు 14న హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌ వద్ద భారీ స్థాయిలో ‘తిరంగా యాత్ర’ నిర్వహించనున్నట్లు రాంచందర్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశంపై తమకున్న భక్తిభావాన్ని చాటుకోవడానికి ఇది సువర్ణావకాశమని పేర్కొన్నారు.

భారతదేశ ఐక్యత, సమగ్రతను చాటడంతో పాటు దేశ ప్రగతికి సంబంధించిన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తిరంగా యాత్ర ఉద్దేశమని ఆయన తెలిపారు. ‘వికసిత్‌ భారత్‌’ సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కులం, మతం, రాజకీయ భేదాలను పక్కనపెట్టి దేశం కోసం నిర్వహించే తిరంగా యాత్రలో హైదరాబాద్‌ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటా జాతీయ జెండా కనిపించేలా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.