నర్సంపేటలో బీఆర్‌ఎస్‌ ధర్నా

  • నర్సంపేటలో విగ్రహ గద్దె కూల్చివేత
  • స్తంభించిన ప్రధాన రహదారుల ట్రాఫిక్
  • పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేతపై నిరసన
  • ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట ఆందోళన
  • ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో ధర్నా
  • కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నినాదాలు
  • మున్సిపల్ కమిషనర్‌పై చర్యలకు డిమాండ్

నర్సంపేట, వరంగల్, వెలుతురు (ఆగష్టు 10):

వరంగల్ జిల్లా నర్సంపేటలో రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు స్థలంలో నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఎదుట బీఆర్‌ఎస్ శ్రేణులు చేపట్టిన ఆందోళనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీ వినోద్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో మున్సిపల్ మాజీ చైర్మన్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అధికారుల ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్పా ర్టీ ముఖ్య నేతలు, స్థానిక ప్రతినిధులు నడిరోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించడంతో నర్సంపేట పట్టణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేస్తున్న విగ్రహ గద్దెను ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా కూల్చివేశారని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడిన నేతలు, ప్రైవేటు స్థలంలో నిర్మించిన గద్దెను కూల్చివేసిన మున్సిపల్ కమిషనర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ధర్నాలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొనడంతో నర్సంపేటలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నర్సంపేట–మహబూబాబాద్, నర్సంపేట–కొత్తగూడ, నర్సంపేట–ములుగు ప్రధాన మార్గాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విగ్రహ గద్దె కూల్చివేతపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని బీఆర్‌ఎస్‌ నాయకులు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.